‘అటవీ’ పట్టాలతో భూ హక్కులు రావు!
సీఎం కేసీఆర్ స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: అటవీ ప్రాంతాల్లో గిరిజనులు, ఇతర సాంప్రదాయ వర్గాలు సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు కల్పిస్తూ జారీ చేసిన ఆర్‌ఓఎఫ్‌ఆర్ (రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) పట్టాలు వాస్త వానికి భూమి పట్టాలు కావని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సుప్రీం తీర్పు, రాజ్యాం గం, అటవీ చట్టాల ప్రకారం.. అటవీ భూములకు ఉన్నఫళంగా పట్టాలు జారీ చేయడం సాధ్యం కాదన్నా అటవీ భూమిని తీసుకుంటే అటవీ శాఖకు అంతే భూమిని ప్రత్యామ్నాయంగా కేటాయించాల్సి ఉంటుం దని.. ఆ భూమిలో అడవి పెంపకం కోసం ఎకరాకు రూ.6 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కానీ అడవులను నరికి సాగు చేసుకుంటే ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు వస్తాయన్న దురభిప్రాయంతో కొందరు ఇంకా చెట్లను నరుక్కుంటూ పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
దీనిపై కొంత గందర గోళం నెలకొని ఉందని, అటవీ భూములకు పట్టాలపై త్వరలో ప్రభుత్వం నుంచి స్పష్టత తీసు కొస్తామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం అంశంపై శుక్ర వారం శాసనసభలో జరిగిన చర్చలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు వస్తాయని కొందరు మభ్యపెడుతుండడంతో అమాయక గిరిజనులు అడవులను నరికి సాగు చేసుకుంటున్నారని, దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. వీరయ్య అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. గందరగోళాన్ని దూరం చేసేందుకు చర్యలు తీసుకుంటామ న్నారు. రాష్ట్రంలో రికార్డుల ప్రకారం 25 శాతం అటవీ భూములు ఉండాలని.. కానీ 10 శాతం వరకు మాత్రమే అడవులు మిగిలాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా అడవులు కుచించుకుపోతే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని చెప్పారు. రాష్ట్రంలో అటవీ భూముల అన్యాక్రాంతంపై వచ్చే బడ్జెట్ సమావేశాల్లో వివరాలు ఇస్తామన్నారు.
యాదాద్రి విద్యుత్ ప్లాంట్ భూములూ కబ్జా
నల్లగొండ జిల్లాలో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం సేకరించిన అటవీ భూములు సైతం కబ్జాకు గురయ్యాయని... అక్కడికి వెళ్లి చూస్తే పంటలు సాగు చేసుకుం టున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ అటవీ భూముల కోసం కేంద్రానికి ప్రత్యామ్నాయ భూములు, ఎకరాకు రూ.6 లక్షల చొప్పున అటవీ అభివృద్ధి నిధులను చెల్లించినప్పటికీ అక్కడ పనులు చేసే పరిస్థితి లేదన్నారు. ఆ భూమి కోసం వెళ్తే అక్కడ జనం ఉన్నారని, కరెంటు మోటార్లు, పంటలు ఉన్నాయని.. కబ్జాలు చేసిన వాళ్లే ధర్నాలు చేస్తున్నారన్నారు.