గండి పడడంతో వృథాగా పోతున్న నీరు
-
తోటపల్లి ఎడమ కాలువకు భారీగండి
-
పరిమితికి మించి నీరు విడుదలే కారణమనే విమర్శలు
-
55 వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకం
-
సైపూన్ మరమ్మతులకు నిధులు మంజూరైనప్పటికీ టెండర్లు పిలవని అధికారులు
తోటపల్లి ప్రాజెక్టు ఎడమ కాలువ ఆయకట్టు రైతుల ఆశలకు ఆదిలోనే గండిపడింది. పెద్దబుడ్డిడి–సంతనర్సిపురం మధ్యలో ఉన్న కాలువ సైపూన్‌కు గురువారం భారీ గండి పడడంతో నీరు వృథాగా ఒట్టిగెడ్డలోకి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు కాలువకు నీటి సరఫరాను నిలిపివేశారు. దీంతో 55 వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు వరుణుడు ముఖం చాటేయడంతో చాలాచోట్ల వరినాట్లు పడలేదు. అక్కడక్కడ పడిచోట వేసవిని తలపిస్తున్నట్టు ఎండలు మండిపోతుండడంతో ఎండిపోతున్నాయి. ఎడమ కాలువ ద్వారా సాగునీరు అందుతోందనుకుంటే.. గండి పడడంతో రైతుల ఆశలు అడిఆసలయ్యాయి. 2011 అక్టోబర్ నాలుగో తేదీన కూడా ఇదే సైపూన్ ప్రధాన గట్టు విరిగిపోవడంతో భారీ గండి పడి 23 రోజులు సాగునీరందక పంటలు ఎండిపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజా గండితో అన్నదాత గుబులు చెందుతున్నాడు.
వీరఘట్టం:
తోటపల్లి ఎడమ ప్రధాన కాలువకు గండి పడడంతో సాగునీరు అందుతోందో..లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వంద మీటర్ల పొడవు ఉన్న సైపూన్‌కు సుమారు 50 మీటర్లు గండి ఏర్పడడంతో కాలువ ద్వారా వస్తున్న వేలాది క్యూసెక్కులనీరు ఒట్టిగెడ్డలో కలిసిపోయింది. దీంతో నీటిని అధికారులు నిలిపివేయడంతో తిరిగి నీటిని ఎప్పుడు ఇస్తారు, గండిని ఎప్పుడు పూడ్చుతారోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ధనదాహమే గండికి కారణం!
అధికార పార్టీ నాయకుల ధనదాహమే గండి పడటానికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. కాలువ పరిస్థితిని ఇటీవల ఇంజినీరింగ్ అధికారులు తనిఖీ చేసి మరమ్మతులు అవసరమని భావించారు. ఇందుకోసం రూ.38.50 లక్షలతో గట్టు నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు. నిధులు కూడా ఈ ఏడాది మే నెలలో మంజూరు అయినప్పటికీ పనులు జరిపించడంలో అధికార పార్టీ నాయకులు తమ ప్రతాపాన్ని చూపించారు. టెండర్ల ద్వారా పనులు జరిపితే తమకు ప్రయోజనం లేదని, ఆ నిధులను విభజించి నామినేటెడ్ పనులు చేపట్టి నిధులు కాజేయాలని పథకం పన్నారు. ఈ క్రమంలోనే టెండర్లను పిలవకుండా అధికార ప్రతాపాన్ని చూపించడంతో జలవనరుల శాఖాధికారులు టెండర్లు పిలవకుండా పనులను పక్కన పెట్టేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం
వందేళ్ల చరిత్ర ఉన్న తోటపల్లి కాలువలను ఆధునీకరించకుండా తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కొన్నిచోట్ల కాలువలు అక్రమణలకు గురై పూడికలతో నిండిపోయావి. ఈ పరిస్థితుల్లో అప్పటి డిజైన్ ప్రకారం సైపూన్ వద్ద ఆరు అడుగుల నీరు విడుదల చేస్తే తప్ప సాగునీరు అందని పరిస్థితి. ఆ స్థాయిలో నీరు విడుదల చేస్తే కాలువ ప్రారంభమయ్యే చోటే గండి పడేందుకు అవకాశం ఉంది. ఈ విషయాన్ని నీటి పారుదల శాఖాధికారులు ప్రభుత్వానికి నివేదించినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గత వారం రోజులుగా శివారు రైతులు సాగునీటి కోసం ఆందోళన చేస్తున్న పరిస్థితిల్లో ఉన్నతాధికారులు దిగువస్థాయి సిబ్బందిని మందలించి వారిని బాధ్యులను చేశారు. దీంతో ఒత్తిడిలో ఉన్న అధికారులు పరిమితికి మించి నీటిని కాలువలోకి విడిచిపెట్టారు. నీరు విడిచిపెట్టిన 24 గంటల లోపే బలహీనంగా ఉన్న గట్లు వద్ద లీకులు ఏర్పడి..కోతకు గురై సైపూన్ వద్ద గండి పడింది.
55 వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకం
తోటపల్లి ఎడమ కాలువ పరిధిలో అధికారికంగా సుమారు 40 వేల ఎకరాల ఆయకట్టు. ఉంది. అయితే ఈ ఏడాది ఖీరీఫ్ ప్రారంభంలో వర్షాలు పుష్కలంగా కురవడంతో.. శివారు పొలాలకు కూడా సాగునీరందించడమే తమ లక్ష్యమని అధికారులు ప్రకటించారు. దీంతో మరో 25 వేల ఎకరాల ఆయకట్టు పెరిగింది. ఇప్పటి వరకూ 55 వేల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. అయితే తాజాగా కాలువకు గండి పడడంతో సాగునీరు ఎక్కడ అందదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
సిబ్బందిపై ఎస్‌ఈ ఆగ్రహం
సైపూన్ మరమ్మతులకు నీరు–చెట్టులో భాగంగా మంజూరైన రూ.38.50 లక్షల నిధులతో పనులు చేయించకపోవడంపై స్థానిక అధికారులపై బొబ్బిలి సెక్షన్ జలవనరుల శాఖ ఎస్‌ఈ ఎం.వి.రమణమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారి శ్రీకాకుళం డివిజన్‌లో ఇబ్బందులు వస్తున్నాయని మండిపడ్డారు. తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి నాలుగు రోజుల్లో మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. ఒట్టిగెడ్డలో వస్తున్న నీటిని మళ్లించి పనులు చేయించాలని సూచించారు. అంతకుముందు గండిని పరిశీలించారు. ఆయనతో పాటు ఈఈ రవీంద్ర, డీఈఈ గనిరాజు, ఏఈలు ఉదయభాస్కర్, రాజేష్‌కుమార్, దాలయ్య,తోటపల్లి ప్రాజెక్టు చైర్మన్ నిమ్మక పాండురంగ ఉన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
తోటపల్లి ఎడమ కాలువ ఆయకట్టు రైతులకు ప్రభుత్వ నిర్లక్ష్యమే శాపంగా మారింది. కాలువలను అభివృద్ధి చేయాలని, ఆధునికీకరణ పనులు చేపట్టాలని ఎన్నోసార్లు అసెంబ్లీలో ప్రస్తావించినప్పటికీ టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. కాలువల అభివృద్ధి కోసం వైఎస్సార్‌సీపీ తరఫున అవసరమైతే అమరణ నిరాహార దీక్ష చేపడతాను.
– విశ్వసరాయి కళావతి,పాలకొండ ఎమ్మెల్యే