మయూర్ భంజ్ :
యూనిఫాం ధరించలేదన్న కారణంతో నలుగురు హోంగార్డులపై ఓ పోలీసు అధికారి కర్కశంగా వ్యవహరించారు. రథ యాత్రలో విధులు నిర్వహిస్తున్న సమయంలో యూనిఫాం సరిగా ధరించలేదని నలుగురు హోంగార్డులను రిజర్వు ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ సేతీ చేతులుపైకి పెట్టమని, మోకాళ్లపై పోలీస్ స్టేషన్ ఎదుటే కూర్చోపెట్టారు. వీరిలో ఓ మహిళా హోంగార్డు కూడా ఉన్నారు. ఈ సంఘటన ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలో బరిపాడాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దీనిపై హోంగార్డ్ డీజీ బినయా బెహెరా అధికారుల తీరుపై సీరియస్ అయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి మయూర్ భంజ్ ఎస్పీ, హోంగార్డ్ కమాండెంట్ల నుంచి రిపోర్టులు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. విచారణ పూర్తయిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఒడిశాలో మొత్తం 17,675 మంది హోంగార్డులున్నారు. 8 గంటలు విధులు నిర్వహిస్తే వీరికి రోజుకు రూ.220 ఇస్తారు. గత ఏడాది సందీప్ హాతి(45) అనే హోంగార్డు సీఎం నవీన్ పట్నాయక్ ఇంటి ఎదుటే నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడనే కారణంతో అతన్ని విధుల్లో నుంచి తొలగించారు. పోలీసులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ ఉన్నతాధికారుల 'చలవ'తోనే వీరి జీవితం ఆధారపడి ఉంటోంది.
హోంగార్డులపై కర్కశత్వం.. కలకలం
Published Thu, Jun 29 2017 12:17 PM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM
Advertisement
Advertisement