- చనిపోయిన వ్యక్తి పేరుతో చెల్లింపు
- సిరిసిల్లలో ఆలస్యంగా వెలుగుచూసిన వైనం
- నోటీస్ జారీ చేశాం : మున్సిపల్ కమిషనర్
కౌన్సిలర్ భర్తకు ‘ఆసరా’ !
Published Wed, Aug 3 2016 10:10 PM | Last Updated on Mon, Aug 20 2018 6:02 PM
సిరిసిల్ల : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఆసరా’ పథకం లక్ష్యం నీరుగారుతోంది. వయోవృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి స్త్రీలు, ఆర్థికంగా నిరుపేదలు పొందాల్సి ఆసరా పింఛన్ సిరిసిల్లలో ఓ కౌన్సిలర్ భర్త పొందుతున్నారు. చనిపోయిన వ్యక్తి పేరిట మంజూరైన డబ్బులు సదరు వ్యక్తి ఖాతాలో జమ అవుతున్నాయి. ఎనిమిది నెలలుగా ఈ తంతుసాగుతున్న అధికారులు గుర్తించలేకపోయారు. ఎట్టకేలకు బుధవారం వెలుగులోకి వచ్చింది.
బాలయ్య పింఛన్ సత్తయ్యకు
స్థానిక సాయినగర్‌కు చెందిన వేముల బాలయ్యకు 23062 ద్వారా ఆసరా పింఛన్ వచ్చేది. బాలయ్య 2015, డిసెంబరు 16న మరణించాడు. చనిపోయిన బాలయ్య పేరిట వస్తున్న ‘ఆసరా’ డబ్బులు మున్సిపల్ 18వ వార్డు కౌన్సిలర్ కుల్ల నిర్మల భర్త కుల్ల సత్తయ్య బ్యాంకు ఖాతాకు జమ అవుతున్నాయి. బాలయ్య చనిపోయి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఆయన పేరిట ప్రతీ నెల పింఛన్ మంజూరవుతూనే ఉంది. బాలయ్య పింఛన్ నంబరుపై కుల్ల సత్తయ్య ఆధార్ నంబరు నమోదైంది. దీంతో ఎనిమిది నెలలుగా పింఛన్ డబ్బులు సత్తయ్య ఖాతాలో చేరుతున్నాయి.
మున్సిపల్ అధికారుల నిర్వాకం
ఆసరా పింఛన్లను బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేశారు. కంప్యూటర్ ద్వారా ఆన్‌లైన్‌లో పింఛన్లను నమోదు చేసిన మున్సిపల్ అధికారులు బాలయ్య పేరిట ఉన్న ఆసరా ఖాతాకు కుల్ల సత్తయ్య బ్యాంకు ఖాతా నంబరు, ఆధార్‌నంబర్‌ను ఎలా అనుసంధానం చేశారనేది అంతుచిక్కని ప్రశ్న. మున్సిపల్ అధికారులు కళ్లు మూసుకుని కౌన్సిలర్ భర్త ఖాతాకు జమ చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయమై కౌన్సిలర్ భర్త కుల్ల సత్తయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా తనకు తెలియకుండానే ఖాతాలో డబ్బులు జమయ్యాయన్నారు. ఇది ఎవరో కావాలని చేశారని, తిరిగి మున్సిపల్‌కు చెల్లిస్తానని వివరణ ఇచ్చారు.
రికవరీకి నోటీసు జారీ చేశాం
– బి.సుమన్‌రావు, కమిషనర్
ఎనిమిది నెలలుగా బాలయ్య పేరిట మంజూరైన డబ్బులు సత్తయ్య ఖాతాకు చేరాయి. పింఛన్ డబ్బుల రికవరీకి సత్తయ్యకు నోటీసు జారీ చేశాం. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన కంప్యూటర్ ఆపరేటర్‌కు మెమో ఇచ్చాం. ఈ పొరపాటు ఎలా జరిగిందో విచారణ చేపడుతున్నాం. ఇలాంటివి ఇంకా ఏమైనా ఉన్నాయో ఆరా తీస్తున్నాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
Advertisement
Advertisement