CM KCR Interesting Comments on Aasara Pension in Suryapet Public Meeting - Sakshi
Sakshi News home page

పింఛన్ పెంచుకుందాం

Published Mon, Aug 21 2023 12:54 AM | Last Updated on Thu, Aug 24 2023 3:38 PM

CM KCR in Suryapet Public Meeting On Aasara Pension Increase - Sakshi

ఆదివారం సూర్యాపేటలో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు హాజరైన జన సందోహం. (కింద) ప్రజలకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

వాళ్లు అరచేతిలో వైకుంఠం చూపుతారు 
కాంగ్రెస్‌ ఒక్క అవకాశం ఇవ్వాలని ఇప్పుడు అడుగుతోంది. మొన్నటిదాకా 50ఏళ్లు అధికారం ఇస్తే ఏం చేసింది? నాడు రైతులు చనిపోతున్నా పట్టించుకోలేదు. ఆపద్బంధు కింద రూ.50 వేలు ఇస్తామనీ సరిగా ఇవ్వలేదు. రూ.500 పెన్షన్‌ ఇవ్వలేదు. అలాంటి కాంగ్రెస్‌ వాళ్లు ఇప్పుడు పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని అంటున్నారు. వారు అధికారంలో ఉన్న కర్ణాటకలో పెంచకుండా ఇక్కడ పెంచుతామని మాయ మాటలు చెప్తున్నారు. కాంగ్రెస్‌ వాళ్లు ఆపద మొక్కులు మొక్కుతారు. అరచేతిలో వైకుంఠం చూపుతారు. వారి మాటలు నమ్మి మోసపోవద్దు. మనం పెన్షన్‌ మొత్తాన్ని పెంచుకుందాం. ఎంతనేది త్వరలోనే ప్రకటిస్తా.
– సీఎం కేసీఆర్‌ 

సాక్షి ప్రతినిధి నల్లగొండ/ సూర్యాపేట: రాష్ట్రంలో మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని.. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా గతంలో కంటే ఐదారు సీట్లు ఎక్కువే గెలుస్తామని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే ఎవరెవరో వస్తారని.. వారి మాయ మాటలు నమ్మి ఓట్లు వేస్తే ఆగమవుతామని ప్రజలు  జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

త్వరలోనే ఆసరా పింఛన్లు పెంచుకుందామని చెప్పారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌ భవనం, మెడికల్‌ కాలేజీ, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్, జిల్లా పోలీస్‌ కార్యాలయంతోపాటు బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ ప్రగతి నివేదన సభలో మాట్లాడారు. సభలో కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

‘‘కాళేశ్వరం నీళ్లు తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడలోని మోతె మండలం వరకు ఎలా వచ్చాయో మీకు తెలుసు. ఒకప్పుడు కరెంటు రాకపోతే, మోటార్లు కాలిపోతే రైతులు ఇబ్బందులు పడేవారు. వాటిని చూసి ఉద్యమ సమయంలో నేను కంటతడి పెట్టాను. ఇప్పుడు కాళేశ్వరం జలాలు వస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు ఒకడు మోటార్లకు మీటర్లు పెట్టాలంటడు, మరొకడు 3 గంటలు కరెంటు చాలంటడు. కాంగ్రెస్‌ వాళ్లు కర్ణాటకలో కరెంటు సరిగా ఇవ్వక జనాలు ఇబ్బందులు పడుతున్నారు. మనం మళ్లీ అలా గోసపడదామా? లేదంటే 24 గంటల కరెంటు కావాలా? ఆలోచించాలి. 

ధరణి వద్దంటే దళారుల దందానే.. 
కాంగ్రెస్‌ రాజ్యం వస్తే మళ్లీ పైరవీకారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ధరణితోనే ఇప్పుడు రైతుబంధు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతోంది. ధాన్యం అమ్ముకున్నా ఖాతాలోనే సొమ్ము పడుతోంది. కాంగెస్‌ వస్తే రైతు బంధు, రైతుబీమా వంటి పథకాలు ఉండవు. గతంలో పాస్‌బుక్‌ల విషయంలో ఎమ్మార్వో, ఆర్డీఓ, జేసీ, కలెక్టర్, సీసీఎల్‌ఏ, మంత్రి ఇలా ఎవరు పడితే వారు పెత్తనం చేసేవారు.

వీఆర్వోలు ఇష్టానుసారంగా పేర్లు మార్చేశారు. అందుకే ఆ వ్యవస్థను రద్దుచేశాం. దాని స్థానంలో ధరణిని తీసుకువచ్చాం. అధికారులకు ఉన్న పవర్‌ను ధరణితో రైతుల బొటనవేలికే ఇచ్చాం. రికార్డులను ఎవరూ మార్చలేరు. కాంగ్రెస్‌ ధరణిని తీసేస్తామంటోంది. మళ్లీ దళారుల దందా రావాలా? 

వాళ్లు నల్లగొండను పట్టించుకోలేదు 
కాంగ్రెస్‌ పాలనలో నల్లగొండ జిల్లాను పట్టించుకోలేదు. సూర్యాపేట ప్రజలకు మురుగునీటినే తాగించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాకే మిషన్‌ భగీరథ ద్వారా రక్షిత తాగునీటిని అందిస్తున్నాం. నల్లగొండ జిల్లా అభివృద్ధికి కావాల్సినన్ని ని«ధులు ఇచ్చాం. మంత్రి జగదీశ్‌రెడ్డి కొట్లాడి మరీ నల్లగొండ జిల్లాకు విద్యుత్‌ ప్లాంట్‌ సాధించారు. రూ.30 వేల కోట్లతో నిర్మిస్తున్న దానిని త్వరలోనే ప్రారంభించుకుంటాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలి. 

బీసీలందరికీ ఆర్థిక సాయం 
బీసీలందరికి ఆర్థిక సాయం అందుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరూ అనుమానం పెట్టుకోవద్దు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో చెట్టుకొకరు పుట్టకొకరు ఉన్న వారంతా ఇప్పుడు గ్రామాలకు వచ్చి, పనులు చేసుకుంటున్నారు. అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాం. ఈ అభివృద్ధి ఇంకా కొనసాగాలి. 

సూర్యాపేటకు సీఎం వరాలు 
సూర్యాపేట జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీకి రూ.10 లక్షల చొప్పున.. సూర్యాపేట మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, జిల్లాలోని మిగతా నాలుగు మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నాం. కళాభారతి నిర్మాణానికి రూ.25 కోట్లు ఇస్తాం. స్పోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాటు కోసం జీవో జారీ చేస్తాం. అతిథి గృహం మంజూరు చేస్తాం. 
 
రూ.37 వేల కోట్లు రుణామాఫీ చేశాం 
కరోనాతో రుణమాఫీ విషయంలో కొంత ఆలస్యమైంది. ఇప్పుడు రూ.37 వేల కోట్ల రుణమాఫీ చేశాం. దేశంలో ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టినది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ఇప్పుడిప్పుడే రైతులు ఒకరి వద్ద చేయి చాచకుండా బతుకున్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగాం. రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఖమ్మంలో సీతారామ వంటి ప్రాజెక్టులతో దిగుబడి 4 కోట్ల టన్నులకు పెరుగుతుంది. 
 
దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచాం 
తెలంగాణ ఏర్పాటయ్యాక అద్భుత పనితీరుతో మానవాభివృద్ధి, తలసరి ఆదాయంలో దేశంలోనే టాప్‌లో నిలిచిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. సూర్యాపేట కొత్త కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను ప్రారంభించుకుంటున్నామని.. కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ, సెక్రటేరియేట్లు కూడా ఈ స్థాయిలో లేవని కేసీఆర్‌ చెప్పారు. సూర్యాపేటలో సీఎం కార్యక్రమాల్లో మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 
  
సర్కారును నడిపడమంటే.. సంసారం నడిపించినట్టే.. 
సూర్యాపేట సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆద్యంతం ఛలోక్తులతో సాగింది. ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రస్తావిస్తూ. ‘‘సర్కారు నడిపించాలంటే.. సంసారం నడిపించినట్టే..’’ అని కేసీఆర్‌ పేర్కొనడంతో సభలో నవ్వులు విరిశాయి. తర్వాత ‘‘60 ఏళ్ల నుంచి రూ.200 పింఛన్‌ ఇవ్వలేని కాంగ్రెస్‌ వాళ్లు ఇవాళ రూ.4వేలు ఇస్తరట.. అంటే నేను రూ.5వేలు ఇవ్వాలా? ఇదేమన్నా వేలం పాటనా?’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

ఇక మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రసంగంలో సూర్యాపేటలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎంను కోరారు. తర్వాత కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘జగదీశ్‌రెడ్డి ఇంత హుషారని అనుకోలేదు. మనకు అన్ని ఇచ్చారు, సూర్యాపేట జిల్లా కూడా ఇచ్చారు. అన్నీ అయిపోయాయి. సభకు వచ్చిపోతే చాలు. ఏమీ అడగనని అక్కడ చెప్పిండు. ఇప్పుడు అవికావాలి, ఇవి కావాలి అని అందరి ముందూ అడుగుతున్నారు..’’ అని పేర్కొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement