అమడగూరు : డబ్బులకోసం ఆశ పడిన మహిళలు సినీఫక్కీలో మోసపోయిన ఘటన గురువారం రెడ్డివారిపల్లిలో చోటు చేసుకుంది. బాధిత మహిళల వివరాల మేరకు.. రెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి బెంగుళూరులో ఒక కంపెనీలో పనిచేస్తూ యజమానికి నమ్మిన బంటుగా ఉన్నాడు. అయితే పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ యజమానికి చిక్కొచ్చి పడింది. దీనికోసం ప్రసాద్‌ను పావుగా వాడుకున్నాడు. తెలిసిన వాళ్ల బ్యాంకు ఖాతాలు కావాలన్న యజమాని కోరిక మేరకు ప్రసాద్ తన సొంతూరి మహిళలను ఉపయోగించుకున్నాడు.
బుధవారం ఉదయం గ్రామానికి చెందిన వారితో ఫోన్‌లో మాట్లాడి ఆధార్‌కార్డు, గుర్తింపుకార్డు తీసుకువస్తే డబ్బులు ఇస్తామని తెలిపాడు. దీంతో ఆశ పడి కూలి పనులు చేసుకునే 22 మంది మహిళలు బాడుగ వాహనంలో యశ్వంతపురంలోని బసవేశ్వర నగర్‌కు చేరుకుని ప్రసాద్‌ను కలిశారు. అయితే అక్కడికెళ్లగానే వేలిముద్రలు వేసేవారు అవసరం లేదని సంతకం చేసేవారే కావాలని 22 మందిలో 9 మందిని ఎంపిక చేసుకున్నారు. ఆ తొమ్మిది మందిని యాక్సిస్ బ్యాంకుకు తీసుకెళ్లి ఫొటోలు తీసి, ఒక్కొక్కరి దగ్గర 42 సంతకాలు చేయించుకున్నారు. అందులో ఖాళీ చెక్కులు కూడా ఉన్నాయి.
మహిళలు అక్కడుండగానే వారి పేరు మీద ఖాతా పుస్తకాలు, ఏటీఎం కార్డులు సైతం వచ్చేశాయి. దీంతో ప్రసాద్ అందరినీ తీసుకుని రాత్రి 12 గంటల సమయంలో గ్రామానికి చేరుకుని ప్రతి మహిళకూ రూ. 500 ఇచ్చాడు. కాగా ఈ విషయం తెలుసుకున్న మహిళల భర్తలు తమను మోసం చేశారంటూ ప్రసాద్‌తో గొడవకు దిగారు. గురువారం పలువురి పెద్దమనుషుల తీర్మానం మేరకు బెంగుళూరుకు వెళ్లి బ్యాంకు ఖాతాలు రద్దు చేయించాలని తీర్మానించుకున్నారు. అనుకున్న ప్రకారం గురువారం మధ్యాహ్నం పెద్దమనుషులతో పాటుగా మహిళలు బెంగుళూరుకు వెళ్లి ఖాతాలు రద్దు చేయించుకున్నారు.
సినీఫక్కీలో మోసం
Published Thu, Nov 17 2016 11:22 PM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM
Advertisement
Advertisement