
ఆటల పోటీల పేరుతో ఘరానా మోసం
ఆటల పోటీలు నిర్వహించి, పతకాలు, ప్రోత్సాహకాలు అందజేస్తామంటూ మోసానికి పాల్పడిన ఘటన ఇది.
యాదగిరిగుట్ట: ఆటల పోటీలు నిర్వహించి, పతకాలు, ప్రోత్సాహకాలు అందజేస్తామంటూ మోసానికి పాల్పడిన ఘటన ఇది. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో శనివారం వెలుగుచూసింది. నల్లగొండ జిల్లాకు చెందిన సుదర్శన్‌గౌడ్, వరంగల్‌కు చెందిన రాము ‘స్టూడెంట్ ఒలంపిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి కరీంనగర్, నల్లగొండ, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో విస్తృత ప్రచారం చేసుకున్నారు. తమ సంస్థ క్రీడాకారులకు పోటీలు నిర్వహించి నైపుణ్యాన్ని వెలికి తీస్తుందని చెప్పుకున్నారు. ఈ మేరకు నాలుగు జిల్లాలకు చెందిన 600 మంది నుంచి రూ.800, రూ.1,200 చొప్పున వసూలు చేశారు. జూలై 9వ తేదీన యాదగిరిగుట్టలో పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు వారందరికీ సమాచారం అందించారు. ఈ మేరకు ఆటగాళ్లంతా శనివారం గుట్టకు చేరుకున్నారు.
అయితే, గుట్ట పట్టణంలో ఆటల పోటీల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. పాతగుట్టకు వెళ్లే రోడ్డులో పొలాలు, ఖాళీ స్థలాల్లో పోటీలు ప్రారంభించారు. క్రికెట్‌కు స్టంపులను కూడా ఇవ్వలేదు. స్టంపులకు బదులు రాళ్లు ఉంచారు. అలాగే, కొన్ని పోటీలను మమ అనిపించారు. అయితే, నిర్వాహకులిద్దరూ సాయంత్రం గొడవకు దిగారు. నువ్వెంతంటే నువ్వెంత అనుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. దీంతో నిర్వహించిన పోటీల్లో విజేతలకు మెడల్స్ లేవు.. పతకాలు లేవు. ఈ పరిణామంతో బిక్కమొహం వేసిన ఆటగాళ్లు ఉండాలో వెళ్లాలో తెలియక పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. తమకు జరిగిన మోసాన్ని పోలీసులకు వివరించాలని నిర్ణయించుకున్నారు.