
వసతుల్లేని గృహం
♦ అవస్థలు పడుతున్న దివ్యాంగులు
♦ అధికారుల హామీలు మాటలకే పరిమితం
కడప నగరం మోచంపేటలోని ప్రభుత్వ వికలాంగుల వసతి గృహం సమస్యలకు నిలయంగా మారింది. కనీస వసతుల్లేని ఈ వసతి గృహంలో ఇరవై ఏళ్లుగా దివ్యాంగులైన విద్యార్థులు అవస్థలు పడుతున్నా అధికారు లకు కనికరం కలగడం లేదు. దీంతో విసిగి వేసారిపోయిన విద్యార్థులు మంగళవారం కడపకు వచ్చిన ప్రతిపక్షనే త వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
కడప కార్పొరేషన్: మోచంపేటలోని ప్రభుత్వ వికలాంగుల వసతి గృహంలో చెవుటి, మూగ విద్యార్థినులు 18 మంది, అంధ విద్యార్థినులు 8 మంది, వికలాంగులు ముగ్గురు ఉన్నారు. రెడ్‌క్రాస్ సంస్థకు చెందిన భవనంలో ఈ వసతి గృహం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నెలనెలా వారికి రూ.5వేలు బాడుగ చెల్లిస్తుంది. అయితే ఇటు రెడ్‌క్రాస్ సంస్థ వారుగానీ, ప్రభుత్వంగానీ విద్యార్థినులకు కనీస వసతులు కల్పించలేదు. తాగునీరు, లైట్లు, ఫ్యాన్లు వంటి కనీస సౌకర్యాలు లేనే లేవు, చెవిటి, మూగ విద్యార్థినులు ఉంటున్న డార్మెటరీ చిన్నవాన పడినా ఉరుస్తోంది. వానపడితే గోడలకు విద్యుత్ సరఫరా అవుతోంది. కొంచెం పెద్ద వాన పడితే వెనకాల ఉన్న పెద్ద డ్రైనేజీ కాలువలోంచి బాత్‌రూముల ద్వారా వసతిగృహంలోకి మురికినీరు వచ్చేస్తుంది.
సమస్యలున్న మాట వాస్తవమే
వసతి గృహంలో సమస్యలున్న విషయం వాస్తవమే. వీటిని పరిష్కరించాలని వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ దృష్టికి తీసుకెళ్లాము. ఎక్కడైనా మా విద్యార్థులకు కనీస వసతులున్న వసతి గృహాన్ని కేటాయిస్తే బాగుంటుంది. - మల్లీశ్వరి, హాస్టల్ వార్డెన్
ఎంపీ వైఎస్ అవినాష్ ముందుకొచ్చినా...
ప్రభుత్వ వికలాంగుల వసతి గృహానికి స్థలం చూపితే తన నిధులతో భవనాలు నిర్మిస్తానని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. కానీ రెవెన్యూ అధికారులు వీరికి స్థలం కేటాయించే విషయమై చొరవ చూపకపోవడంతో ఆ ప్రతిపాదన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. రెం డవ గాంధీ బొమ్మ వెనుక ఉన్న పాత యునానీ హాస్పిటల్ భవనాన్ని ఈ విద్యార్థులకు కేటాయించాలని వికలాంగుల శాఖ ఏడీ కలెక్టర్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఆ ప్రతిపాదన కూడా ముందుకు కదల్లేదు.
ఈ హాస్టల్ పక్కనే ప్రభుత్వ బాలుర వసతి గృహం-1 ఉండేది. ఇక్కడ కూడా సరైన వసతులు లేకపోవడంతో ఇక్కడి విద్యార్థులంతా ప్రకాష్‌నగర్‌లో ఉన్న హాస్టల్‌కు వెళ్లారు. ప్రస్తుతం ఆ హాస్టల్ భవనాలు ఖాళీగా ఉన్నాయి. అధికారులు ఇప్పటికిప్పుడు కొత్తవి కట్టించలేని పక్షంలో ఈ వసతి గృహానికి మరమ్మతులు చేసి, కూలిపోయిన ప్రహరీని పునర్నిర్మించి దివ్యాంగులను తాత్కాలికంగా అందులో సర్దవచ్చు. దీనివల్ల నెలనెలా బాడుగ ఖర్చు కూడా మిగిలే అవకాశం ఉంది. ఆ దిశగా కూడా అధికారులు చర్యలు చేపట్టలేదు.