15 నుంచి గో పాల, అందాల పోటీలు
ద్వారకాతిరుమల : గోపాల, అందాల పోటీల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్థక శాఖ (ఏపీఎల్‌డీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీడీ కొండలరావు చెప్పారు. జిల్లా పశుగణాభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో ద్వారకాతిరుమల మార్కెట్ యార్డులో ఈనెల 15 నుంచి 17 వరకు జాతి ఆవులకు పాల, అందాల పోటీలను నిర్వహించనున్నామని చెప్పారు. దీనిలో భాగంగా ఏర్పాట్లను పరిశీలించేందుకు తాను ఇక్కడకు వచ్చానని చెప్పారు.
ఒంగోలు, ముర్రా, గిర్, పుంగనూరు జాతి ఆవులకు పాల పోటీలు నిర్వహిస్తామన్నారు. గెలుపొందిన ముర్రా గేదెలు, ఒంగోలు ఆవులకు ప్రథమ బహుమతిగా రూ.50 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.30 వేలు, తతీయ బహుమతిగా రూ.20 వేలు అందజేస్తామన్నారు. గిర్, పుంగనూరు జాతి ఆవులకు ప్రథమ బహుమతిగా రూ.25 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.15 వేలు, తృతీయ బహుమతిగా రూ.10 వేలు అందిస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే ప్రతి ఆవుకు ప్రోత్సాహక బహుమతి ఉంటుందన్నారు. జాతి లక్షణాలు ఆధారంగా ఆవులను, గిత్తలను ఎంపిక చేసి అందాల పోటీలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంత వాసులైనా పోటీల్లో పాల్గొనవచ్చని చెప్పారు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ పి.గాంధీ, డివిజినల్ సహాయ సంచాలకుడు డాక్టర్ సత్యగోవింద్, జేడీ జ్ఞానేశ్వరరావు, ద్వారకాతిరుమల, పెంటపాడు, నిడదవోలు, భీమవరం మండలాల పశువైద్యులు కిరణ్, మురళీకష్ణ, నాయక్, కుమార్‌రాజా ఉన్నారు.