అధిక వర్షాలే పత్తికి శాపం | full rain shock to cotton | Sakshi
Sakshi News home page

అధిక వర్షాలే పత్తికి శాపం

Published Tue, Aug 9 2016 5:42 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

అధిక వర్షాలే పత్తికి శాపం

అధిక వర్షాలే పత్తికి శాపం

  • నల్లరేగడి నేలల్లో ఎర్రబారుతున్న తెల్లబంగారం
  • పెరుగుతున్న కలుపు మెుక్కలు.. సోకుతున్న తెగుళ్లు 
  • దాదాపు లక్ష ఎకరాల్లో పత్తికి పొంచివున్న విపత్తు 
  • పంటలను పరిశీలించని వ్యవసాయ అధికారులు 
  • సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌ : ఈ ఏడాది పత్తి సాగు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం విస్త­ృతంగా ప్రచారం చేసినా రైతులు మాత్రం తెల్లబంగారం వైపే మెుగ్గుచూపారు. వరుసగా మూడేళ్లుగా నష్టాలు వస్తున్నా ఈసారైనా పంట పండకపోతుందా అనే ఆశతో పత్తి సాగు చేపట్టారు. అయితే గత రెండుమూడు సంవత్సరాలుగా వర్షాభావం అన్నదాత దెబ్బతీయగా... ఈసారి అధిక వర్షాలు శాపంగా మారాయి. ప్రధానంగా నల్లరేగడి నేలల్లో నీళ్లు నిలిచి పత్తి ఎర్రబారడంతోపాటు బూజు తెగులు, వేరుకుళ్లు సోకింది. కలుపు మొక్కలు విపరీతంగా పెరుగుతున్నాయి. వ్యవసాయాధికారులు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. 
    వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం జిల్లావ్యాప్తంగా 4.25 లక్షల ఎకరాల్లో ఈ సీజన్‌లో రైతులు పత్తి సాగు చేశారు. పత్తి సాగు మొదలై ఇప్పటికి  45 రోజులు గడిచాయి. గత నెల రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడమే పత్తి రైతుకు శాపమైంది. ముఖ్యంగా నల్లరేగడి నేలల్లో సాగు చేసిన పత్తి రైతుకు ఎక్కువ ఇబ్బందులొచ్చాయి. మంథని డివిజన్‌తోపాటు చొప్పదండి, హుజూరాబాద్, మానకొండూర్‌ నియోజకవర్గాల్లో వేలాది ఎకరాల్లో పత్తికి తెగుళ్లు సోకాయి. మంథని డివిజన్‌లోని ఏడు మండలాల్లో ఈసారి యాభై వేల ఎకరాలకు పైగా పత్తి సాగు చేయగా, గత పదిహేను రోజులుగా వర్షం అధికంగా కురవడంతో పత్తి చేలల్లో నీరు నిలిచింది. తద్వారా మొక్క ఎదుగుదల ఆగిపోయి ఎర్రబారుతోంది. వేరుకుళ్లు, బూజు తెగుళ్లు అధికమవుతున్నాయి. ఉదాహరణకు రామడుగు మండలంలో ఈ సీజన్‌లో 13,125 ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. వర్షాల కారణంగా మండలంలోని రామడుగు, వెదిర, వెలిచాల, దేశరాజ్‌పల్లి, మోతె, రుద్రారం, కొక్కెరకుంట గ్రామాలలో పత్తి పంట ఎర్రబారుతోంది. వాతావరణంలో మార్పులు సంభవించడం, ధాతు లోపం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తోందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. 
    కలుపు మొక్కలతో తంటాలు
    మరోవైపు పత్తి చేలల్లో విపరీతంగా కలుపు మొక్కలు పెరిగాయి. వాటిని ఏరివేసేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. ఒకవైపు వేలాది రూపాయలు ఖర్చు చేసి కలుపు నివారణ మందును పిచికారి చేస్తూనే... మరోవైపు కూలీలతో కలుపు తీసే పనిలో నిమగ్నమయ్యారు. కలుపు తీసేందుకు కూలీలు దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో ఒక్కో కూలీకి రెండు మూడు వందలు చెల్లించాల్సి వస్తోందని రామడుగు మండలం దేశరాజ్‌పల్లికి చెందిన రైతు సత్యనారాయణరెడ్డి చెప్పారు. కొందరు రైతులు తక్కువ ఖర్చుతో కలుపు నివారణ మందులను పిచికారీ చేస్తున్నప్పటికీ వాటి వాడకంవల్ల భూసారం దెబ్బతింటుందని వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు. మొత్తమ్మీద అధిక వర్షాలతో ఎర్రబారిన పత్తికి తెగుళ్లు సోకంతో ఈ ఏడాది దిగుబడి తగ్గే అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని జేడీఏ సుచరిత దృష్టికి తీసుకెళ్లగా పత్తి ఎర్రబారుతున్న విషయం ఇంతవరకు తమ దృష్టికి రాలేదని పేర్కొన్నారు. 
    ఈ చర్యలు తీసుకోవాలి.. 
    పత్తిలో నీరు నిలుస్తుంటే ప్రతి 8–10 సాళ్లకు ఒకటి చొప్పున గొడ్డుచాలు వాలు చూసుకొని వాలు ఉన్నవైపు ఎత్తు నుంచి పల్లానికి పారతో గాని, నాగలితో గాని ఒక ఫీటు నుంచి ఫీటున్నర లోతు ఉండేట్లు తీసి నీటిని బయటకు పంపాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. వర్షం ఆగిపోయిన వెంటనే ఒకటి రెండు రోజుల్లో తెగుళ్ల ముందు బ్లైటాక్స్‌ 45 గ్రాములు 15 లీటర్ల నీళ్లలో కలిపి, దాంతో పాటు స్ట్రెప్టోమైసిన్‌ సల్ఫేట్‌ మూడు గ్రాములు 15 లీటర్ల నీటిలో కలిపి మెుక్క, వేళ్లు తడిచే విధంగా మగ్గు పోయడం లేదా పిచికారీ చేయాలని పేర్కొంటున్నారు. 
    జాగ్రత్తలు పాటించాలి
    – డాట్‌ కంట్రోల్‌ కో ఆర్డినేటర్‌ ఆరుణశ్రీ
    వర్షాలు కురిసి పత్తి పంటలో నీరు నిలవడం వల్ల మెుక్కలు ఎర్రబారుతున్నాయని డాట్‌ కంట్రోల్‌ కో ఆర్డినేటర్‌ అరుణశ్రీ అన్నారు. ధాతు లోపం ఉన్నందున మెగ్నీషియం సల్ఫేట్, జింక్, బొరాక్స్‌లను తగిన మోతాదులో రోజుకు రెండుసార్లు పిచికారీ చేసుకోవాలని రైతులకు సూచించారు. పత్తి పూర్తిగా ఎర్రబడేంతగా రానందున ముందు జాగ్రత్తలు తీసుకుంటే మొక్క సాధారణంగా ఎదుగుతుందన్నారు. పత్తి విత్తనాలు వేసి నెల రోజులు దాటినందున రసం పీల్చే పురుగులు ఆశిస్తాయని, పొలాల్లో ఎలాంటి పురుగులున్నాయో తెలుసుకునేందుకు పసుపు డబ్బాకు గ్రీసు రాసిపెట్టే పద్ధతితోపాటు బొట్టు పెట్టే పద్ధతి ద్వారా వాటిని నివారించవచ్చునని వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement