నిధులున్నా.. నిష్ప్రయోజనం !
– ఎఫ్‌ఏఓ లేక ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు ఆగిన జీతభత్యాలు
– రూ.6.06 కోట్ల బడ్జెట్ వచ్చినా జీతాలివ్వలేని పరిస్థితి
– వేలాది మంది ఉద్యోగులు ఎదురుచూపులు
అనంతపురం ఎడ్యుకేషన్ : ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా ఉందని సర్వశిక్ష అభియాన్ ఉద్యోగల వ్యథ. ఇన్ని రోజులూ బడ్జెట్ లేక జీతాలు ఇవ్వని సర్వశిక్ష అభియాన్ ఇప్పుడు నిధులున్నా...ఇవ్వలేని పరిస్థితి. జిల్లాకు సంబంధించి రూ.24 కోట్లు కావాలంటూ నివేదికలు రాష్ట్రానికి పంపారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం రూ.6.6 కోట్లు కేటాయించారు. రెండు రోజుల క్రితం ఖాతాలోనూ జమ చేశారు. కానీ ఈ డబ్బులో నుంచి ఒక్క రూపాయి కూడా వాడుకోలేని పరిస్థితి. సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో పని చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు ఫైనాన్స్ అకౌంట్స్ ఆఫీసర్ (ఎఫ్‌ఏఓ) లేకపోవడంతో జూన్ నెల జీతం ఇప్పటిదాకా రాలేదు. దీంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి వర్ణణాతీతం.
సర్వశిక్ష అభియాన్‌లో 63 మంది ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, 63 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 357 మంది సీఆర్పీలు, 63 మంది మెసెంజర్లు, 378 మంది పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు, 126 మంది ఐఈఆర్టీలు, 12 మంది డీఎల్‌ఎంటీలు, 756 మంది కేజీబీవీల సిబ్బంది పని చేస్తున్నారు. వీరిలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కేజీబీవీల్లో పని చేస్తున్న ఎస్‌ఓలు, సీఆర్టీలు, నాన్‌టీచింగ్ ఉద్యోగులకు ఐదు నెలలుగా జీతాలు రాలేదు. ఫిబ్రవరి నుంచి బకాయిలున్నాయి. అలాగే ఎమ్మార్సీ ఉద్యోగులకు మార్చి నెల నుంచి అంటే నాలుగు నెలలుగా జీతాలు రాలేదు. చాలామంది ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భారంగా మారిన కుటుంబ పోషణ : గతంలో నెలనెలా క్రమం తప్పకుండా జీతాలు మంజూరు చేసేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ అధ్వానంగా నెలల తరబడి పెండింగ్ పెడుతున్నారు. వస్తున్న జీతాలు అంతంత మాత్రమేనని అవికూడా సరిగా ఇవ్వకపోతే ఎలా అని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో నిత్యం తిరగాల్సి ఉంటుందని, నెలంతా పని చేసి జీతాల కోసం ఎదురు చూసే పరిస్థితి నెలకొంటోందంటున్నారు. కనీసం అప్పులు కూడా పుట్టడం లేదని కొందరు చెబుతుండగా, మరికొందరు అధికవడ్డీకి అప్పులు చేస్తున్నామంటూ వాపోతున్నారు. వీరి వేతనాలతో పాటు కార్ల అద్దె కూడా చెల్లించలేదని వాహన యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొసమెరుపు : ఇన్ని రోజులూ బడ్జెట్ లేక జీతాలు పెండింగ్ పెట్టారు. ప్రస్తుతం రూ. 6.06 కోట్లు బడ్జెట్ వచ్చింది. ఇందులో అందరీ ఉద్యోగులకు రెండు నెలల జీతాలు చెల్లించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. పీఓ–ఎఫ్‌ఏఓ ఇద్దరూ సంతకాలు పెడితేనే ప్రతి పైసా ఖర్చు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఎఫ్‌ఏఓ పోస్టు ఖాళీగా ఉండటం కొసమెరుపు.
బడ్జెట్ వచ్చింది :
జీతాల కోసం రూ.6.06 కోట్లు బడ్జెట్ వచ్చింది. ఎఫ్‌ఏఓ పోస్టు ఖాళీగా ఉంది. ఈ విషయం ఎస్పీడీ అధికారులకు విన్నవించాం. వీలైనంత త్వరగా ఎఫ్‌ఏఓను నియమిస్తారు. ఎఫ్‌ఏఓ రాగానే కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెన్నెళ్ల జీతాలు, రెగ్యులర్ ఉద్యోగులకు జూన్ నెల జీతాలు జమ చేస్తాం.
- సుబ్రమణ్యం, పీఓ ఎస్‌ఎస్‌ఏ