‘ఎకో’దంతుడే బెస్ట్‌ | ganesh uthsavas coming soon | Sakshi
Sakshi News home page

‘ఎకో’దంతుడే బెస్ట్‌

Published Wed, Aug 24 2016 10:07 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

‘ఎకో’దంతుడే బెస్ట్‌ - Sakshi

‘ఎకో’దంతుడే బెస్ట్‌

►   సమీపిస్తున్న గణేష ఉత్సవాలు
►   వినాయకుడి విగ్రహాల తయారీలో హానికారక రంగుల వినియోగం
►   రసాయన మిశ్రిత విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు
►   నిమజ్జనం తరువాత చెరువుల్లో కరగని వ్యర్థాలు
►   ప్రజల్లో చైతన్యం తీసుకురావాలంటున్న పర్యావరణవేత్తలు

విఘ్నాలన్నింటినీ తొలగించే వినాయకుడు, గణాలన్నింటికీ అధినాయకుడైన గణనాథుడు ప్రజలందరీ చేత పూజలందుకోవడానికి మరికొద్ది రోజుల్లో వాడవాడలా కొలువుదీరనున్నాడు.  అయితే వినాయక విగ్రహాల తయారీలో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ను వాడడంతో పాటు అనేక రసాయన రంగులను ఉపయోగిస్తుండటంతో నిమజ్జనం తరువాత చెరువులు, కుంటలు కరగని వ్యర్థాలతో నిండిపోతున్నాయి. ఈ పరిణామం పర్యావరణానికి ఎంతో హానికలిగించడమే కాదు, జలసంపదపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుకే పర్యావరణానికి ఏ మాత్రం హానికలిగించని ‘ఎకో’దంతుని పూజించాలంటూ పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.


వినాయక విగ్రహాల అలంకరణ కోసం ప్లాస్టిక్‌తో తయారైన పూలు, థర్మోకోల్‌ ఉత్పత్తులను ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఉత్సవాలు ఆఖరున విగ్రహాలతో పాటు అలంకరించిన సామగ్రి కూడా నిమజ్జనం చేస్తున్నారు. దీంతో ప్లాస్టిక్, థర్మోకోల్‌ పదార్ధాలన్నీ అలాగే ఉండిపోతున్నాయి. వీటి బదులు సహజ సిద్ధమైన పూలు, మామిడి, నిమ్మ ఆకులు, పసుపు, చందనం, కుంకుమ, గరికలతో అలంకరించడం వల్ల పర్యావరణానికి ఏ మాత్రం హాని జరగకపోగా పండుగను మరింత సంప్రదాయ బద్ధంగా నిర్వహించడానికి కూడా వీలవుతుందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.

వీటి వినియోగం ప్రమాదమే
వినాయకుని విగ్రహానికి వేసే రంగుల్లో సిలికాన్‌పొడి, జింక్‌ పొడి, చాక్‌పీస్‌ పొడి, గాజు పొడి కలుపుతారు. ఇవి నీటిలో, భూమిలో కలిస్తే మానవళికి ప్రమాదం. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారీస్‌ ఏళ్లు గడిచినా భూమిలో కలవదు. రంగుల కోసం మెర్క్యూరీ సల్ఫేట్, పొటాషియం, డ్రైక్రోమిట్,క్రోమియం, అయోడైడ్,  లెడ్‌ఆక్సైడ్, కాడ్మియం, నికెల్‌ వాడకం వల్ల  అలర్జీ, ఉబ్బసం, న్యూమోనియా, చర్మ వ్యాధులు, గ్రహణశక్తి తగ్గడం, కిడ్నీ ఇన్‌ఫెక్షన్, పిల్లల్లో శారీరక, మానసిక ప్రవర్తనలలో మార్పులు, ఎముకల బలహీనత సంభవించవచ్చు. భారీ శబ్ధతరంగాలను వెలువరించే సౌండ్‌ సిస్టమ్‌ కాకుండా మంద్ర స్థాయిలో ఏర్పాటు చేయడం వల్ల శబ్ధ కాలుష్యాన్ని నివారించుకోవచ్చు.

మార్గదర్శకాల అమలులో ఉదాసీనత
కాలుష్యాన్ని నివారించేందుకు 2010లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. సమాజ హితానికి పనికొచ్చే ఈ మార్గదర్శకాల అమలును కాలుష్య నియంత్రణ శాఖ, మున్సిపాలిటీ/పంచాయతీ, మత్స్యశాఖ, నీటి పారుదల శాఖలు విస్మరించాయి. దీంతో వినాయకచవితి వేడుకలు పర్యావరణకు ముప్పు వాటిల్లేలా మారాయి. ప్రతి ఏటా జిల్లాలో 20వేల నుంచి 25వేల వినాయక విగ్రహాలు, ప్రతిమలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 98శాతం ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారీస్‌తో తయారు చేసినవే కావడం గమనార్హం. వీటిని చెరువులు, కాలువలలో నిమజ్జనం చేయడం వల్ల జల కాలుష్యం పెరిగిపోతోంది. మానవాళి మనుగడకు ప్రమాదకరంగా మారుతోంది.

మట్టి వినాయకులే మేలు
మట్టికి సులువుగా కరిగే గుణం ఉంటుంది. విగ్రహాల తయారీలో చెరువు మట్టి వినియోగంతో పూడిక సమస్యలు తొలుగుతాయి. అందుకే మట్టికి ప్రాధాన్యం ఇచ్చేవారు. వినాయక చవితినాడు 18 రకాల ప్రతులతో మట్టి విగ్రహాన్ని పూజించేవారు. ఆధునిక వైద్యం అందుబాటులో లేని రోజుల్లో వర్షాకాలంలో వరదల తరువాత జరిగే నీటి కాలుష్యాన్ని నివారించేందుకు ఈ 18 రకాల పత్రులతో మట్టి విగ్రహాన్ని పూజించి, వాటిని తెల్లారే నదిలో నిమజ్జనం చేసేవారు. ఈ ప్రతులను ఎందుకు వాడాలంటే ఇవి నీటిని శుభ్రపరచడంలో ఆరితేరినవి. ఆనాడు తాగే నీటిని శుభ్రపరచడంతోపాటు చవితి జరుపుకునేవారు. నిజానికి వినాయక చవితి పర్యావరణానికి పూర్తిగా మేలు చేసే పండుగ. వీటిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు నిర్వహణ ఎంతో అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రాణికోటికి ముప్పు
ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారీస్‌తో తయారు చేసే విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేయడం వల్ల ప్రాణికోటి మనుగడ ప్రశ్నార్థకమవుతోంది.  విగ్రహాలకు వాడే రంగుల్లో హానికరమైన రసాయనాలున్నాయి. దీని వల్ల ఆ నీటిని వినియోగిస్తే చర్మవ్యాధులు సంభవిస్తాయి. మట్టి విగ్రహాలయితే ఎలాంటి హానీ ఉండదు. సహజ రంగులు వాడితే ప్రమాదం ఉండదు. గణపతి వద్ద ఉంచే వివిధ రకాల ఆకుల వల్ల నీటి శుద్ధి జరుగుతుంది. పర్యావరణం దెబ్బతినదు.
– డాక్టర్‌ పద్మావతి, దేవి నర్సింగ్‌హోమ్, ధర్మవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement