రూ. 5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
రూ. 5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
Published Sat, Jul 30 2016 5:57 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
కేరళకు చెందిన వ్యక్తి అరెస్టు
గోకవరం:
అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఓ కారును ఎక్సైజ్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సినీఫక్కీలో వెంబడించి పట్టుకున్నారు. కారులో సుమారు రూ. 5 లక్షల విలువైన 236 కేజీల గంజాయి పట్టుబడింది. ఈ సందర్భంగా కేరళకు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన ఓ కారు కిర్లంపూడిలోని కృష్ణవరం టోల్‌గేటు వద్ద శనివారం ఉదయం 7 గంటల సమయంలో టోల్‌గేటు రుసుము చెల్లించి చిల్లర తీసుకోకుండా వెళ్లింది. దాంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అనుమానం వచ్చింది. వారు ఆ కారును వెంబడించారు. కారు డ్రైవర్ గండేపల్లి జాతీయ రహదారి నుంచి గోకవరం మండలంలోకి ప్రవేశించి కామరాజుపేటలోని ఎస్సీ కాలనీ శివారుకు చేరుకున్నాడు. ఇంతలో కారు టైరు పేలిపోవడంతో కారులోని బ్యాగ్‌లు తీసుకుని డ్రైవర్ పారిపోతుండగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వెంబడించి అతనిని పట్టుకున్నారు. అతను కేరళకు చెందిన ఎన్.సుభాష్ అని తేలింది. అధికారులకు గ్రామస్తులు కూడా సహకరించారు. ఆ సమయంలో సుభాష్‌తో పాటు కాకినాడ విజిలెన్స్ అండ్ ఎక్సైజ్ సీఐ వేణుమాధవ అస్వస్థతకు గురయ్యారు. వారిద్దరినీ గోకవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ వెంకటరామారెడ్డి ఆధ్వర్యంలో కారులో ఉన్న గంజాయిని గోకవరం తహశీల్దార్ పీవీవీ గోపాలకృష్ణ సమక్షంలో బయటకు తీశారు. సుమారు 236 కేజీల బరువు గల 118 ప్యాకెట్‌ల గంజాయి బయటపడింది. దీని విలువ రూ. 5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ గంజాయిని విశాఖ మన్యం నుంచి ముంబయికి తరలిస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న గోకవరం ఎస్సై ఆర్.శివాజీ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కోరుకొండ ఎక్సైజ్ సీఐ నాగార్జున, వీఆర్వో ధర్మరాజు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement