రబీకి సిద్ధం కండి | Get ready for rabi season | Sakshi
Sakshi News home page

రబీకి సిద్ధం కండి

Published Thu, Sep 8 2016 6:37 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

రబీ సాగుకు సిద్ధమవుతున్న రైతు(ఫైల్‌)

రబీ సాగుకు సిద్ధమవుతున్న రైతు(ఫైల్‌)

  • మరో 20 రోజుల్లో సీజన్‌
  • శనగ, కంది, సోయ, ఆముదం తదితరాలకు అనుకూలం
  • గజ్వేల్‌ ఏడీఏ శ్రావణ్‌కుమార్‌ సలహాలు, సూచనలు
  • గజ్వేల్: ఖరీఫ్‌.. రైతుల ఆశలను అడియాసలు చేసింది. అదను సమయంలో వర్షాలు లేక మొక్కజొన్నతో పాటు ప్రధాన పంటలన్నింటికీ భారీ నష్టం సంభవించింది. వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల సాగు 3.72లక్షల హెక్టార్లకే పరిమితమైంది. వర్షాలు అనుకున్న స్థాయిలో కురిస్తే నిజానికి 5.5లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చేది. కానీ పరిస్థితి భిన్నంగా మారింది.

    ఉన్న పంటలు కూడా సక్రమంగా లేకపోవడం రైతులను ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి తరుణంలో రైతులు మరో 20రోజుల తర్వాత ‘రబీ’కి సిద్ధం కావాల్సి ఉంది. ప్రస్తుత సీజన్‌లో వేయదగిన పంటలు, వాటి యాజమాన్య పద్ధతులపై గజ్వేల్‌ ఏడీఏ శ్రావణ్‌కుమార్‌ (సెల్ : 7288894469) సలహాలు, సూచనలు అందించారు.

    శనగ
    అక్టోబర్‌ నుంచి నవంబర్‌ 30 వరకు ఈ పంటను విత్తుకోవచ్చు. ఎకరాకు 24-26 కిలోల విత్తనం అవసరముంటుంది. అదే విధంగా 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఇందుకోసం అవసరముంటుంది. ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తుంది. ఇవే కాకుండా జ్యోతి, అన్నెగిరి, శ్వేత, క్రాంతి, ఐసీసీవీ-10 రకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. రైతులు విధిగా రైజోబియం కల్చర్‌తో విత్తన శుద్ధి చేపట్టాలి.

    కంది
    అక్టోబర్‌లో ఈ విత్తనాన్ని విత్తుకోవచ్చు. ఎకరాకు 4-5కిలోల విత్తనం అవసరముంటుంది. 12కిలోల నత్రజని, 20కిలోల బాస్వరం మోతాదులో రెండు పర్యాయాలు వేయాల్సి వుంటుంది. ఎల్‌ఆర్‌జీ-30, సీ-11, అభయ, ఐసీపీఎల్‌ 85063తోపాటు పలు రకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

    సోయచిక్కుడు
    అక్టోబర్‌ నెలలో విత్తనం వేయాల్సి వుంటుంది. ఎకరాకు 20-24 కిలోల విత్తనం అవసరముంటుంది. 12కిలోల నత్రజని, 24కిలోల భాస్వరం, 16కిలోల పొటాష్‌ అవసరముంటుంది. మార్కెట్‌లో ప్రస్తుతం హార్డీ, జేఎస్‌-335, మ్యాక్స్‌ 58/201/పీకే 472/ఎల్‌ఎస్‌బీ-1, మోనెట్టా. డైథేన్, థైరమ్‌ 3గ్రాములు కిలో విత్తనం చొప్పున వేసి శుద్ధి చేయాలి.

    నువ్వులు
    డిసెంబర్‌ 15 నుంచి జనవరి 15 వరకు విత్తనాలు వేసుకోవచ్చు. ఎకరాకు 2-2.5 కిలోల విత్తనం అవసరముంటుంది. 16కిలోల నత్రజని, 24కిలోల బాస్వరం, 12కిలోల పొటాష్‌ వేసుకోవాలి. రాజేశ్వరీ, వైఎల్‌ఎం-17, పూసోబోల్డ్, క్రాంతి, సీత, వరుణ, కష్ణ రకాల విత్తనాలు మార్కెట్‌లో దొరుకుతున్నాయి.

    పొద్దుతిరుగుడు
    అక్టోబర్‌ నుంచి నవంబర్‌ నెలాకరు వరకు ఈ విత్తనాలను వేసుకోవచ్చు. ఎకరాకు సాధారణ రకాలు 2.4-3.2, హైబ్రిడ్‌ రకాలయితే 2-2.4 కిలోల విత్తనం అవసరముంటుంది. ఇందుకోసం 26కిలోల నత్రజని, 24కిలోల బాస్వరం, 12కిలోల పొటాష్‌ వేయాల్సి వుంటుంది. ఈజీ68414, మోర్డాన్, కో-1, ఏపీఎస్‌హెచ్‌-11, ఎంఎస్‌ఎఫ్‌హెచ్‌-8, 17, కేబీఎస్‌హెచ్‌-1, బీఎస్‌హెచ్‌-1 రకాలు మార్కెట్‌లో దొరుకుతాయి. 25-35 టన్నుల ఎరువు వాడాలి. కలుపు నివారణకు పైరు మొలకెత్తకముందే 15కిలోల ఫ్లూకోరాలిన్‌ చల్లాలి. విచ్చుకునే దశ, గింజలు ఏర్పడే దశలో నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి.

    ఆముదం
    అక్టోబర్‌ నుంచి నవంబర్‌ 15వరకు విత్తనాలు వేసుకోవచ్చు. ఎకరాకు 5-6కిలోల విత్తనం అవసరముంటుంది. 16కిలోల నత్రజని, 16కిలోల భాస్వరం, 8కిలోల పొటాష్‌ వేసుకోవాలి. అరుణ, భాగ్య, సౌభాగ్య, 48-1, గౌచ్‌1, క్రాంతి, హరిత, కిరణ్, జ్యోతి, జ్వాల, జీసీహెచ్‌-4, డీసీహెచ్‌-32 రకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కాఫ్టాన్‌ లేదా థైరమ్‌తో విత్తన శుద్ధి చేపట్టాలి. 2టన్నుల పశువుల ఎరువును వాడితే మంచింది.

    దనియాలు
    అక్టోబర్‌ నుంచి నవంబర్‌ వరకు విత్తనాలను వేసుకోవాల్సి వుంటుంది. ఎకరాకు 6కిలోల విత్తనం అవసరముంటుంది. 12కిలోల నత్రజని, 16కిలోల భాస్వరం, 8కిలోల పొటాష్‌ వేసుకోవాలి. ఎకరానికి 4టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement