అమ్మా నన్ను క్షమించు...! | girl sucide love affair | Sakshi
Sakshi News home page

అమ్మా నన్ను క్షమించు...!

Published Mon, May 15 2017 3:16 AM | Last Updated on Tue, Nov 6 2018 8:22 PM

అమ్మా నన్ను క్షమించు...! - Sakshi

అమ్మా నన్ను క్షమించు...!

మాతృదినోత్సవం నాడు నీకు శోకం కలిగించినందుకు...!!
ప్రేమోన్మాదానికి యువతి ఆత్మహత్య
తనను ఒక వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేసాడని సూసైడ్‌ నోట్‌


పిఠాపురం/కొత్తపల్లి : ‘అమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం. మాతృ దినోత్సవం నాడు నీకు పుత్రికా శోకం కలిగిస్తున్నందుకు నన్ను క్షమించు. నాకు బాగా చదువు కోవాలని ఐఏఎస్‌ అవ్వాలని ఉంది కాని నన్ను ఒక ప్రేమోన్మాది మోసం చేసాడు. అందుకే నేను అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నా’ అంటు ఒక యువతి సూసైడ్‌ నోట్‌ రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ సంఘటన ఆదివారం కొత్తపల్లి మండలం కొమరగిరి శివారు ఆనందనగరంలో తీవ్ర విషాదఛాయలు నింపింది. ‘ప్రేమ పేరుతో వంచించి ముఖం చాటేశాడు. వాళ్ల నాన్నను, అమ్మను అడిగితే నీ ఇష్టమొచ్చినట్లు చేసుకో అన్నారు. అలాగని అతనిని మర్చిపోలేను అతనంటే నాకు చాలా ఇష్టం అందుకే మీకు అన్యాయం చేసి వెళ్లి పోతున్నా’. ‘నా చావుకు నన్ను మోసం చేసిన కన్నాతో పాటు వాళ్ల కుటుంబం కారణం.

ఎవరిని వదిలినా బేబమ్మను మాత్రం వదలకు. అమ్మా ఐలవ్‌యూ. మాతృదినోత్సవ శుభాకాంక్షలు నన్ను క్షమించు మరో జన్మంటు ఉంటే మళ్లీ  నీరుణం తీర్చుకుంటా.  చెల్లి అమ్మ జాగ్రత్త, సునీల్‌ బాగా చదువుకో అమ్మను బాగా చూసుకో’  అంటు మృతురాలు రాసిన సూసైడ్‌ నోట్‌ చూసిన ప్రతి ఒక్కరు కంట తడిపెడుతున్నారు. కొత్తపల్లి మండలం కొమరగిరి శివారు ఆనందనగర్‌లో ఆదివారం బక్కా శిరీష 19 అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఐఏఎస్‌ అవతానని కలలు కన్న తన కన్న కూతురు మాతృదినోత్సవం నాడు అర్థంతరంగా తనువు చాలించడం తట్టుకోలేని మృతురాలి తల్లి గుండెలవిసేలా రోదిస్తున్న తీరు స్థానికులను కలిచివేసింది.

ఐఏఎస్‌ అవ్వాలని..!
కాకినాడ శాంతి నగర్‌కు చెందిన బక్కా శ్రీను, భవాని దంపతులకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. వారిలో పెద్దదయిన శిరీష చదువులో ప్రతిభా వంతురాలు. ఐఏఎస్‌ అవ్వాలనే పట్టుదలతో బాగా చదివింది. నా కూతురు కలెక్టరు అని మీరు గర్వంగా చెప్పుకునేలా చేస్తానంటు ఎప్పుడు తల్లిదండ్రులతో అంటూ ఉండేదని ఆమె బంధువులు తెలిపారు.పదో తరగతిలో 9.8 గ్రేడు సాధిచిన శిరీష ఇంటర్‌లో 980 మార్కులు సాధించింది. డిగ్రీ చదువుతూ తల్లిదండ్రులకు భారం కాకూడదని పిఠాపురంలో ఒక ప్రైవేటు స్కూలులో టీచర్‌గా చేసేది. కొత్తపల్లి మండలం కొమరగిరి శివారు ఆనందనగర్‌లో ఉంటున్న  అమ్మమ్మ సాకా చిన సత్తిరాజు ఇంటి దగ్గర ఉంటుండేది. అమ్మమ్మ వ్యవసాయ పనుల మీద పిఠాపురం మండలం నర్శింగపురంలో ఒక పొలంలో తాత్కాలికంగా నివాసముంటున్నారు.

ఏం జరిగిందంటే..!
బాధితురాలి బంధువుల కథనం ప్రకారం పిఠాపురం మండలం కోలంకకు చెందిన ఒక పాస్టర్‌ ఆనందనగర్‌లో కొన్నేళ్లుగా ఒక ప్రార్థనా మందిరం నిర్వహిస్తున్నాడు. ఆయన కూడా అతని కుమారుడు కన్నా (మృతురాలి సూసైడ్‌ నోట్‌లో రాసిన ప్రకారం) వచ్చే వాడు. ఈ నేపథ్యంలో శిరీషతో పరిచయం పెంచుకుని ప్రేమిస్తున్నానని నమ్మబలికి తరచూ కలిసేవాడు. ఇలా ఉండే అతడు కొద్ది రోజులుగా మాట్లాడడం మానేసి, ఫేస్‌ బుక్‌లో తన ఖాతా తొలగించి, వాట్సాప్‌ నిలిపివేసి, ఫోన్‌కు బదులిచ్చేవాడు కాదు. ఎంత ప్రయత్నించినా అతని ఆచూకీ తెలియకపోవడంతో శనివారం అతని స్వగ్రామమైన కోలంక వెళ్లి కన్నా కుటుంబ సభ్యులను ఆరా తీసింది. అయితే మా కొడుకే కనిపించడం లేదు అయినా మావాడితో నీకు సంబంధం ఏమిటీ? మర్యాదగా వెళ్లిపో నీఇష్టం వచ్చినట్లు చేసుకో అని గెంటేసినట్టు చెబుతున్నారు.

దీంతో తాను మోసపోయానని ఏడుస్తూ స్థానికులకు తనకు జరిగిన అన్యాయం చెప్పుకుంది. ఆమె బాధను ఎవరూ పట్టించుకోపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై అదే గ్రామంలో పొలంలో ఉన్న అమ్మమ్మ వద్దకు వెళ్లి ఆ రాత్రికి ఉండిపోయింది. ఆదివారం ఉదయం ఆనందనగర్‌ వచ్చిన శిరీష ఉదయం నుంచి ఇంట్లోనే ఉండిపోయింది. సాయంత్రం 4.30 గంటల ప్రాంతలో ఆమె బంధువులు ఇంట్లో చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది.

ఆమెను కిందకు దింపి చూడగా ఆమె మృతి చెందిఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. తన చావుకు కన్నా వాళ్ల అమ్మ నాన్నలే కారణమని మృతురాలు రాసిన సూసైడ్‌నోట్‌ సైతం లభించింది. పోలీసులు దానిని కొత్తపల్లి ఎస్సై సత్యనారాయణ, ఏఎస్సై లోవరాజులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కన్నా తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement