మళ్లీ బాలికలదే హవా
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో అగ్రస్థానం
సాక్షి, విజయవాడ బ్యూరో: ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో ఎప్పటిలా బాలికలే అగ్రస్థానంలో నిలిచారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు రెండింటిలోనూ వారిదే పైచేయిగా ఉంది. ఫస్టియర్ ఫలితాల్లో బాలుర కంటే బాలికలు 8.07 శాతం, సెకండియర్ ఫలితాల్లో 5.31 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు రెండూ ఒకేసారి విడుదల చేయడం ఇదే తొలిసారి. ఫస్టియర్‌లో 68.05 శాతం మంది, సెకండియర్‌లో 73.78 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
ఫస్ట్ ఇంటర్‌లో 58.29 శాతం మందికి ‘ఏ’ గ్రేడ్
ఫస్టియర్ ఇంటర్ పరీక్షలకు మొత్తం 4,67,747 మంది విద్యార్థులు హాజరవగా వారిలో 3,18,300 (68.05 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 1,85,538 (58.29 శాతం) మంది ‘ఏ’ గ్రేడ్‌లో ఉత్తీర్ణులయ్యారు.
సెకండియర్‌లో 57.46 శాతం మందికి ‘ఏ’ గ్రేడ్
సెకండ్ ఇంటర్‌లో మొత్తం 4,11,941 మంది పరీక్షలు రాయగా 3,03,934 (73.78 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 1,74,649 (57.46 శాతం) మంది ‘ఏ’ గ్రేడ్‌లో ఉత్తీర్ణులయ్యారు.
మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
మార్కుల జాబితాలను కాలేజీల ప్రిన్సిపాల్స్ 23వ తేదీన ఆర్‌ఐఓల నుంచి తీసుకుని విద్యార్థులకు అందించాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సత్యనారాయణ ఆదేశించారు. మార్కుల జాబితాలో ఏవైనా తేడాలు వస్తే సంబంధిత ప్రిన్సిపాల్స్ ద్వారా మే 18వ తేదీలోపు బోర్డు స్వీకరిస్తుంది. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లింపులను ఈ నెల 26వ తేదీ వరకూ స్వీకరిస్తారు. ఆ తర్వాత పెనాల్టీ ద్వారా చెల్లింపులకు అవకాశం లేదు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 24వ తేదీ నుంచి జరుగుతాయి. రీ కౌంటింగ్‌కు ఈ నెల 26వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రతి పేపర్‌కు రూ.120 చొప్పున ఫీజు చెల్లించాలని సత్యనారాయణ చెప్పారు. అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైనవారు బెటర్‌మెంట్ పరీక్షలకు హాజరయ్యేందుకు రూ.120 ఫీజు చెల్లించాలి. ఫస్ట్ ఇంటర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులు పాసైన సబ్జెక్టులకు ఫెయిలైన సబ్జెక్టులతోపాటు పరీక్షలు రాయొచ్చని, ఇలా రాసిన వారి తాజా ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటామని ఆయన తెలిపారు.
రెండు ఫలితాలూ ఒకేసారి ఇదే ప్రథమం: గంటా
ఇంటర్ ఫలితాల చరిత్రలో మొదటిసారిగా ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్ని ఒకేసారి విడుదల చేశామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇంటర్ సిలబస్ మార్పు విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి గంటా మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇంటర్ సిలబస్ మార్పుపై కొంతకాలంగా ఊహాగానాలు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై మంత్రి దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మాత్రం చెప్పారు.
‘కృష్ణా’కు మళ్లీ అగ్రపీఠం
కొన్నేళ్లుగా ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో అగ్రస్థానంలో నిలుస్తున్న కృష్ణాజిల్లా ఈసారీ ఆ స్థానాన్ని పదిలపర్చుకుంది. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ కృష్ణాజిల్లా టాప్‌లో నిలిచింది. ఫస్టియర్ ఫలితాల్లో కృష్ణా విద్యార్థులు 81 శాతం ఉత్తీర్ణత సాధించగా రెండో సంవత్సర ఫలితాల్లో 84 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ ఫలితాల్లో 72 శాతం ఉత్తీర్ణతతో విశాఖపట్నం జిల్లా రెండో స్థానంలో నిలవగా 71 శాతం ఉత్తీర్ణతతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మూడోస్థానంలో నిలిచింది. 57 శాతం ఉత్తీర్ణతతో అనంతపురం జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో నెల్లూరు రెండో స్థానాన్ని దక్కించుకోగా, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాలు మూడో స్థానాన్ని పంచుకున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా 65 శాతం ఉత్తీర్ణతతో చివరిస్థానంలో నిలిచింది.