ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వండి
– పట్టభద్రుల సమస్యలపై గళం విప్పుతా
– వైఎస్ జగన్ నాయకత్వంలో విద్యాభివృద్ధికి కృషి
– డిగ్రీ, డిప్లొమా చేసినవారంతా ఓటర్లుగా చేరండి
– వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి
కర్నూలు(రాజ్‌విహార్): వచ్చే ఏడాది జరిగే శాసన మండలి ఎన్నికల్లో తనకు మద్దతు ఇస్తే పట్టభద్రుల సమస్యలపై గళం విప్పుతానని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి, ఎన్‌జీఓ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కర్నూలుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ పశ్చిమ ప్రాంత పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మండలి ఎన్నికల్లో పోటీకి తన పేరును వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించారని వెల్లడించారు. ఆయన నాయకత్వంలో విద్యాభివృద్ధికి, పట్టభద్రుల సమస్యలపై పోరాటాలు చేస్తానని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత అసెంబ్లీ ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని విమర్శించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోగా కాంట్రాక్టు కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించి, వారి కుటుంబాలను రోడ్డున పడేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. ఇలాంటి సమయంలో నిరుద్యోగుల పక్షాన ఉండి గళం విప్పాల్సిన అవసరం ఉందన్నారు. పట్టభద్రులందరూ మండలి ఎన్నికల్లో తనను ఆదరిస్తే యువనేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో పోరాటాలు చేస్తానని చెప్పారు. డిగ్రీలతోపాటు ఇంజనీరింగ్, మెడిసిన్, డిప్లోమా తదితర పట్టాలు పొందిన ప్రతి ఒక్కరూ తమ పేర్లను మండలి ఎన్నికల జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు. సమావేశంలో జెడ్పీ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు మీసాల రంగన్న పాల్గొన్నారు.