పట్టుదలతోనే లక్ష్యసాధన సాధ్యం
జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ
కల్లూరు: పట్టుదలతోనే లక్ష్య సాధన సాధ్యమని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. శుక్రవారం నగర శివారులోని బృందావన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ సైన్స్ కాలేజ్‌లో కళాశాల వార్షికోత్సవం సందర్భంగా అవార్డ్స్‌డేను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక, క్విజ్ తదితర అంశాల్లో తప్పకుండా పాల్గొనాలన్నారు.
కళాశాల కోశాధికారి డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు ఉత్తమ మార్గాలను అన్వేషించి అవసరమైన వనరులను సమకూర్చడంలో రాజీ పడకుండా ఎల్లవేళలా కృషి చేస్తామన్నారు. అనంతరం వివిధ అంశాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు, అవార్డులు ప్రదానం చేశారు. గాయకులు సాయిశిల్ప, సుమంత్ ఆలపించిన పాటలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ శివప్రసాద్ రెడ్డి, ఈడీలు రమేష్ రెడ్డి, నారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ టీఎస్‌ఎస్ బాలాజీ, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గిరీష్ రెడ్డి, వివిధ శాఖాధిపతులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.