దేవుడిచ్చిన అన్న వైఎస్సార్
మాజీ హోంమంత్రి సబితారెడ్డి
చేవెళ్ల: తనకు దేవుడిచ్చిన అన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని మాజీ హోంమంత్రి పి.సబితారెడ్డి అన్నారు. వైఎస్ వర్ధంతి సందర్భంగా ఆ మహానేతతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. అవి ఆమె మాటల్లోనే.. ఆత్మీయత, అనురాగాన్ని పంచి ‘చేవెళ్ల చెల్లెమ్మగా’ కీర్తిప్రతిష్టలను తెచ్చిపెట్టిన జననేత వైఎస్. నా భర్త, మాజీమంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి 2000 సంవత్సరంలో మరణించినప్పుడు పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన మా స్వగ్రామమైన కౌకుంట్లకు వచ్చి ఓదార్చారు.
‘మీ అన్నయ్యలా నేనున్నాను.. అధైర్యపడొద్దు అంటూ ఓదార్చిన మాటలు నాలో స్థైర్యాన్ని నింపాయి. ఇంద్రారెడ్డి మరణించినప్పుడు కోలుకోవడానికి ఎన్నేళ్లు పట్టిందో.. వైఎస్ మరణం తరువాత కూడా కోలుకోవడానికి అంతే సమయం పట్టింది. రాజశేఖర్‌రెడ్డి మా కుటుంబానికి రాజకీయంగా కాకుండా ఆత్మీయుడిగా, కుటుంబ పెద్దగా చూసుకున్నారు. ఇప్పటికీ ప్రతి అడుగులో, నేను చేసే ప్రతి పనిలో ఆయన గుర్తుకొస్తుంటారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక మహిళను హోంమంత్రిగా చేసిన ధీశాలి.
నాయకుడనేవాడు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవచేయాలనే ఆయన మాటలకే నాకు ఇప్పటికీ.. ఎప్పటికీ స్ఫూర్తి. నిబద్ధత, విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనం ఆయన. మాటల్లో కాకుండా చేతల్లో చూపిన ధీశాలి. ఆడపడచుగా అన్నను, రాజకీయంగా మంచి నాయకుడిని, సేవను కాంక్షించే వ్యక్తిగా సేవాతత్పరున్ని కోల్పోయానన్న బాధ ఇప్పటికీ గుండెల్లో మిగిలే ఉంది అంటూ చెమర్చిన కళ్లతో గుర్తుచేసుకున్నారు.