ధర్మవరం టౌన్ : శక్తికి మించి అప్పులు చేయడం.. ఆపై జల్సాలు చేయడం.. ఐపీ నోటీసు ఇచ్చి పరారు కావడం.. పట్టణంలో నిత్యకృత్యమవుతున్నాయి. తాజా ధర్మవరంలోని ఎస్‌ఎల్‌వీ మార్కెట్ వీధిలో బంగారు అంగడి పెట్టుకున్నS ఓ వ్యాపారి పరారయ్యాడు. రూ.2.5కోట్లు అప్పు చేసి ఐపీ నోటీసు కోర్టుకు సమర్పించాడు. విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాలు.. ఎస్‌ఎల్‌వీ మార్కెట్‌లో బంగారు అంగడి పెట్టుకుని ఇద్దరు అన్నదమ్ములు వ్యాపారం చేస్తున్నారు. బంగారు దుకాణాన్ని ఎరగా చూపి కోట్లాది రూపాయలను తెలిసిన వారిదగ్గర అప్పుగా తీసుకున్నారు.
ఆ డబ్బుతో రూ.50 లక్షలు వెచ్చించి పట్టణంలోని సత్యసాయి నగర్‌లో ఓ ఇళ్లు కట్టించారు. చివరకు వడ్డీలకు వడ్డీలు పెరిగి పోవడంతో ఏడాదిక్రితం ఆ ఇంటిని అమ్మివేశారు. ఇళ్లు అమ్మిన ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు అదే ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రుణదాతల ఒత్తిళ్లు అధికమవ్వడంతో నెల క్రితం దుకాణానికి తాళం వేసి, పరారై కోర్టులో ఐపీ నోటీసు ఇచ్చారు. అయితే కోర్టులో ఐపీ పెట్టడానికి గల కారణాలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయం ఆనోటా ఈ నోటా బాధితులకు కూడా తెలిసిపోయింది. బాధితులు తమ డబ్బు వస్తుందా రాదా..? అని మదన పడుతున్నారు. ఎలాంటి కారణం లేకుండా అప్పు ఎగ్గొట్టాలనుకునే వారిపై కఠినంగా చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పట్టణంలో దాదాపు 30 మంది వద్ద నుంచి రూ.2.5కోట్లు బంగారు వ్యాపారులు అప్పు చేసినట్లుగా సమాచారం.
బంగారు వ్యాపారి పరారీ
Published Fri, Sep 2 2016 12:40 AM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
Advertisement
Advertisement