ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించాలి
సంస్థాన్ నారాయణపురం : ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం కలిగించాలని కలెక్టర్ అనితా రామచంద్రన్ పేర్కొన్నారు. ఈ నెల 15న సాక్షి దినపత్రికలో పీహెచ్‌సీలో ప్రసవ వేదన అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన కలెక్టర్ బుధవారం పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో రోగుల గదులను, ఆపరేషన్ థియేటర్, ప్రసవ గదిని, వివిధ గదులను, రికార్డులను పరిశీలించారు. ప్రసవ వేదనతో ఒక గర్భిణి వస్తే, ప్రసవం చేయకుండా ఇలానే చూసేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తే, ఇలానే చేస్తారా అని ప్రశ్నించారు.
ఆ సమయంలో ఉండాల్సిన సిబ్బంది ఎవరని, ఎక్కడ ఉన్నారని, ఏం చేస్తున్నారని, 24గంటలు వైద్య సేవలు అందుతాయని ప్రజలు వస్తే, మీరు ఇలా పనిచేస్తే ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలుగుతుందా అని హెచ్చరించారు. సిబ్బంది ఏదో చెప్పబోతుండగా, తన సెల్‌లో సంస్థాన్ నారాయణపురంలోని పీహెచ్‌సీలో మహిళ ప్రసవం ఫొటోలను వైద్యులకు, సిబ్బందికి చూపించారు. ఇలాంటి సాకులు చెప్పొద్దని, బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో నిర్వహించాలన్నారు.
పేదవాళ్లు వస్తే ఇంత అలుసుగా చూస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. రిసెప్షన్‌లో ఏఎంసీ రిజిస్ట్రర్ రాయకపోవడంపై, మీ పనితీరు తెలుస్తుందన్నారు. ఈడీడీ రిజిస్ట్రర్ కూడా 2సంవత్సరాల నుంచి నిర్వహించకపోవడంపై వైద్యాధికారిపై అసహనం వ్యక్తం చేశారు. మీ రికార్డుల నిర్వహణ తీరు చూస్తుంటేనే తెలుస్తుందన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పీహెచ్‌సీలో అన్ని వైద్య సౌకర్యాలు ఉన్నాయన్నారు. ఇతర సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పనిచేయని వారికి శిక్షలు వేయడం ఒక్కటే జవాబు కాదని, వారిలో మార్పు తీసుకొచ్చి క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వహించాలన్నారు.
సమయపాలన ప్రకారం వైద్యులు, సిబ్బంది వచ్చి సేవలు అందించాలన్నారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, 24గంటల్లో ఎప్పుడు వైద్యానికి వచ్చినా అందించాలన్నారు. పీహెచ్‌సీలపై తనిఖీలు నిర్వహించి, ప్రజలకు వైద్యం అందేలా చూడాలని ఆర్డీఓను ఆదేశించారు. ఆమె వెంట ఆర్డీఓ మహేందర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌కుమార్, ఎంపీడీఓ జి.రజిత, ఎంపీపీ వాంకుడోతు బుజ్జి, మండల వైద్యాధికారి మోహనయ్య తదితరులున్నారు.