
సర్కార్ జీతం.. సొంత ప్రాక్టీస్..
ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు లక్షల రూపాయల జీతం సరిపోవడం లేదట..! నిర్వర్తించాల్సిన విధులను వదిలేసి సొమ్ములు పోగేసే పనిలో నిమగ్నమయ్యారు.
– ధర్మవరంలో ప్రైవేటు ఆస్పత్రులు నిర్వహిస్తున్న వైద్యులు
– సొంత ప్రాక్టీస్‌తో ప్రభుత్వాస్పత్రి సేవలపై నిర్లక్ష్యం
- రోగుల ప్రాణాలతో చెలగాటం
ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు లక్షల రూపాయల జీతం సరిపోవడం లేదట..! నిర్వర్తించాల్సిన విధులను వదిలేసి సొమ్ములు పోగేసే పనిలో నిమగ్నమయ్యారు. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన రోగులు .. డబ్బు జబ్బుతో బాధపడతున్న డాక్టర్లను చూసి ఏవగించుకుంటున్నారు. దీంతో వైద్యోనారాయణో హరీ అన్న పదానికి అర్థం లేకుండా పోతోంది.
ధర్మవరం: ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలు.. కావాల్సిన మందులు.. తీర్చాల్సిన అవసరాలను గమనిస్తూ.. బాధ్యతగా ఉండాల్సిన ధర్మవరం ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ ఇవేవీ పట్టకుండా ఏకంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు చేస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. అయితే చేసే పనిలో శ్రద్ధచూపకపోడం.. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ మధ్యనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గర్భిణీకి ప్రసవం చేసి, ఆమె మృతికి కారణమయ్యారు.
– ఇదే ఆస్పత్రిలోని చిన్నపిల్లల డాక్టర్ సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించాడు. దీంతో ఆయన ప్రభుత్వాస్పత్రిలో కంటే తన క్లినిక్‌లోనే ఎక్కువగా ఉంటున్నాడు. ఈయన ఆందుబాటులో లేని కారణంతో శనివారం ఒక నవజాత శిశువు సరైన సయంలో వైద్యసేవలు అందక ప్రాణం కోల్పోయింది. ఇంత జరుగుతున్నా.. ఇటు అధికారులు కానీ, అటు ఆస్పత్రి అభివృద్ధి కమిటీలు కానీ వీరి దాష్టీకాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో వీరు ఆడిందే ఆట.. పాడిందే పాటగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
ధర్మవరం ఏరియా ఆస్పత్రిలోని కొందరు వైద్యులు విధి నిర్వహణ కన్నా కార్పొరేట్, సొంత వైద్యశాలలకే అధిక సమయం కేటాయిస్తున్నారు. రోజుకు గంట, రెండు గంటలు వచ్చి, మిగతా సమయమంతా సొంత వైద్యశాలల్లోనే ప్రాక్టీసు చేసుకుంటుండడంతో సుదూర ప్రాతంలా నుంచి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రైవేటు ఆస్పత్రులకు రోగుల తరలింపు
ఇక్కడ పనిచేస్తున్న కొందరు వైద్యులు ప్రభుత్వాసుపత్రికి రోగులు వస్తే చికిత్సలు నిర్వహించకుండా సరైన సదుపాయాలు లేవని చెప్పి ధర్మవరం పట్టణంలోని పలు ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లకు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడికి రోగిని తీసుకెళ్లగానే ఇక్కడ పనిచేసే వైద్యులే మళ్లీ ప్రైవేటు నర్సింగ్ హోంలో ప్రత్యక్షమై చికిత్సలు చేస్తున్నట్లు సమాచారం.