కార్మికులను మోసం చేస్తున్న ప్రభుత్వం
కోవూరు: కోవూరు చక్కెర కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందని కోవూరు కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ నాయకులు అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన తెలిపారు.
కోవూరు: కోవూరు చక్కెర కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందని కోవూరు కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ నాయకులు అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాకముందు ఆ పార్టీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎన్నికల ప్రచారం సమయంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే కర్మాగారానికి పూర్వ వైభవం తీసుకువస్తామని చెప్పి ప్రస్తుతం మోసం చేశారన్నారు. సీఎం చంద్రబాబు సైతం ఈ విషయంలో మోసం చేశారన్నారు. కర్మాగార స్థితి దయనీయంగా మారిందన్నారు. కర్మాగారంపై ఆధారపడి 6 వేల మంది రైతులు, 300 మంది కార్మికులు, 2వేల మంది చెరకు నరికే కూలీలు, ట్రాక్టరు యజమానులు, డ్రైవర్లు , టైరుబండ్ల కుటుంబాలతో కలిపి ప్రత్యక్షంగా, పరోక్షంగా పది వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నారన్నారు. వారందరినీ మోసం చేసి ఏదో రకంగా కర్మాగారాన్ని అమ్మేందుకు సిద్ధపడుతున్నారన్నారు. 38 నెలల నుంచి జీతాలు లేక కుటుంబాలను పోషించలేక ఎన్నో బాధలు పడుతున్నామన్నారు. కర్మాగారంలో ఉద్యోగులుగా చేరి ఎటువంటి అలవెన్సులు లేకుండానే రిటైర్డ్ అవుతున్నామన్నారు. కార్యక్రమంలో బిట్రగుంట నారాయణ, అమానుల్లా, సీపీఎం నాయకులు గోని దయాకర్, కృష్ణ, గండవరపు శేషయ్య, ఖాదర్‌బాష, కేశవమూర్తి, సుబ్బయ్య, వెంకయ్య, రజియాబేగం పాల్గొన్నారు.