Published
Wed, Aug 3 2016 6:55 PM
| Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
చిట్యాల: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంతో ప్రజలంతా కలిసి వస్తుంటే రాజకీయ దివాళాకోరుతనంతో ప్రతి పక్షాలు ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆయన రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలిసి బుధవారం హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్‌లో జరిగే కార్యక్రమానికి వెళుతూ చిట్యాల పట్టణ శివారులోని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఫాంహౌజ్‌లో విలేకరులతో మాట్లాడారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఏర్పాటులో నిర్వాసితులకు ప్రభుత్వం గతంలో కంటే మేలైన పరిహారాన్ని అందిస్తుందన్నారు. లక్షల ఎకరాల భూములకు సాగునీరందించే మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి అక్కడి నిర్వాసిత ప్రజలు ప్రభుత్వానికి స్వచ్ఛందంగా సహకరిస్తుంటే ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధికోసం ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయన్నారు. ప్రతి పక్షాలు నిర్మాణాత్మక సూచనలు చేయాలి తప్పితే ప్రాజెక్టుల నిర్మాణాలను, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం తగదన్నారు. జిల్లాలో కాలుష్యకారక పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వమని ఆయన పేర్కొన్నారు. కక్కిరేణిలో ఏర్పాటు చేయనున్న వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజేక్టుకు ప్రజాభిప్రాయసేకరణ ద్వారా ప్రజలు ఆమోదం మేరకు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. వాతావరణ సమతుల్యతను కాపాడుతూ స్థానికులకు ఉద్యోగవకాశాలు కల్పించే పరిశ్రమలకు తమ మద్దతుంటుందన్నారు. ఈ సమావేశంలో నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, నార్మాక్స్ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దుబ్బాక నర్సింహారెడ్డి, జెడ్పీటీసీ శేపూరి రవీందర్, సర్పంచ్ గుండెబోయిన శ్రీలక్ష్మి, ఎంపీటీసీలు ఎద్దులపురి క్రిష్ణ, రెముడాల మల్లేష్, గ్రంథాలయ అధ్యక్షుడు బెల్లి సత్తయ్య, సింగిల్ విండో డైరెక్టర్ కర్నాటి ఉప్పల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు కాటం వెంకటేశం, ఏనుగు నర్సింహారెడ్డి, గొదుమగడ్డ జలంధర్‌రెడ్డి, దుబ్బాక సతీష్‌రెడ్డి, గుండెబోయిన సైదులు పాల్గొన్నారు.