‘ప్రతిభా’శీలురకు అన్యాయం
‘ప్రతిభా’శీలురకు అన్యాయం
Published Sun, Oct 2 2016 6:59 PM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM
* ప్రతిభా పురస్కారాల ఎంపికలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అన్యాయం
* 76 శాతం ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులే ఎంపిక
ప్రభుత్వ పాఠశాలల్లో అరకొర వసతుల నడుమ కష్టపడి చదివి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ఉత్తీర్ణత సాధిం చిన పేద విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ఎంపికలో అన్యాయం చేసింది.
గుంటూరు ఎడ్యుకేషన్: గత మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 342 మంది విద్యార్థులను ప్రభుత్వం ఇటీవల ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేసింది. వీరిలో జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో చదివి అత్యధిక జీఏపీ సాధించిన విద్యార్థులున్నారు. ప్రతిభా పురస్కారం కింద ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.20 వేలు చొప్పున నగదు, ప్రసంశాపత్రం అందించనుంది. ప్రతి యేటా ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల్లో చదివిన విద్యార్థులనే అధిక సంఖ్యలో ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేస్తున్న సంప్రదాయానికి విద్యాశాఖ ఈ ఏడాది తిలోదకాలిచ్చింది. ఫలితంగా జిల్లాలో ఎంపిక చేసిన 342 మందిలో 260 మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులే ఉన్నారు. జిల్లాలోని 57 మండలాల వారీగా మం డలానికి ఆరుగురు చొప్పున విద్యార్థులను ఎంపిక చేసింది. వీరిలో ఇద్దరు జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బాలికా విభాగాల నుంచి ఒక్కొక్కరు చొప్పున మెరిట్, రోస్టర్ ఆధారంగా ఎంపిక చేశారు.
జిల్లాలో 94.76 శాతం ఉత్తీర్ణత
ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభా పురస్కారాల జాబితాలో పేద కుటుంబాల ప్రతిభావంతులకు చోటు దక్కలేదు. గత మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షలకు ప్రభుత్వ పాఠశాలల నుంచి 30,786 మంది విద్యార్థులు హాజరు కాగా, వారి లో 28,561 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో 94.76 శాతం ఉత్తీర్ణత నమోదు కావడం వెనుక ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల కృషి దాగి ఉంది.
41 మందికి 10 జీపీఏ..
ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల నుంచి పరీక్షలకు హాజరైన 41 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. ఆయా యాజమాన్యాల్లోని 123 స్కూళ్లు నూరు శాతం ఉత్తీర్ణత సాధించి ప్రైవేటు పాఠశాలలకు గట్టి పోటీ ఇచ్చాయి. అయితే జిల్లా ఉత్తీర్ణత శాతాన్ని పదిలంగా ఉంచడంలో కృషి చేసిన ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు ప్రభుత్వం పెద్ద పీట వేసింది.
Advertisement