ప్రచారానికి తెర.. ప్రలోభాలతో ఎర
ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉపాధ్యాయ, పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థులు
నెల్లూరు(సెంట్రల్) : తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించిన ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ప్రచారం ప్రారంభించిన అభ్యర్థులు దాదాపు రెండు నెలలు హోరెత్తించారు. ఎన్నడూ లేనంతగా ఈసారి ప్రచారం నిర్వహించారు. దీంతో ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, పీడీఎఫ్ తరఫున యండవల్లి శ్రీనివాసులురెడ్డి.. టీడీపీ ఉపాధ్యాయ అభ్యర్థిగా వాసుదేవనాయుడు, పీడీఎఫ్ తరఫున విఠపు బాలసుబ్రహణ్యంలతో పాటు పట్టభద్రుల స్థానానికి 14 మంది, ఉపాధ్యాయ స్థానానికి తొమ్మిది మంది ఈ ఎన్నికలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
కానీ టీడీపీ, పీడీఎఫ్ అభ్యర్థుల మధ్యే పోటీ తీవ్రంగా ఉంది.మొదలైన వ్యూహాలు ప్రచారంలో ఓటర్ల వద్దకు వెళ్లి మద్దతు కోరిన అభ్యర్థులు మంగళవారం రాత్రి నుంచి ప్రత్యేక వ్యూహాలను రచిస్తున్నారు. ప్రధానంగా టీడీపీ అభ్యర్థి తరఫున మంత్రి నారాయణ అంతా తానై వ్యవహరిస్తున్నారు. మంత్రి నారాయణతో పాటు మంత్రులు గంటా శ్రీనివాసులు, రావెల కిషోర్‌బాబు, సిద్దా రాఘవరావు, కామినేని శ్రీనివాసులు టీడీపీ అభ్యర్థి తరఫున రహస్య సమావేశాలు నిర్వహించి పరోక్షంగా ప్రచారం నిర్వహించారు. అధికార తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఇప్పటికే అనేక అడ్డదారులు తొక్కుతోందని పీడీఎఫ్ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో గురువారం జరిగే ఎన్నికలలో ఎవరి అదృష్టం ఎంతో తేలిపోనుంది.