8న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్05 ప్రయోగం
-
ఇన్‌శాట్–3డీ స్థానంలో ఇన్‌శాట్–3డీఆర్
శ్రీహరికోట (సూళ్లూరుపేట)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈనెల 8న సాయంత్రం 4.10 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్05 ద్వారా 2061 కిలోలు బరువు కలిగిన ఇన్‌శాట్–3డీఆర్ అనే సమాచార ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహించేందుకు సమయాత్తమైంది. షార్‌లోని రెండో ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో అనుసంధానం పనులు పూర్తి చేసుకుని గురువారం ఉదయం 6.10 గంటలకు వ్యాబ్‌నుంచి పట్టాలు లాంటి ట్రాక్‌పై ఊంబ్లికల్‌టవర్ (ప్రయోగవేదిక) ఉదయం 8.15 గంటలకు అనుసంధానించారు. గత నెల 29న ఇన్‌శాట్–3డీఆర్‌ను మరో వ్యాబ్‌లో హీట్‌షీల్డ్‌లో అమర్చి క్లోజ్ చేసి రాకెట్ శిఖరభాగాన అమర్చే ప్రక్రియను పూర్తి చేశారు. రెండురోజుల పాటు అక్కడ తుదివిడత తనిఖీలు నిర్వహించి రాకెట్‌ను ప్రయోగవేదిక మీదకు తరలించారు. 2013 జులై 26న ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ ప్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ రాకెట్ ద్వారా రోదసీలోకి ప్రవేశపెట్టిన ఇన్‌శాట్–3డీ ఉపగ్రహం సాంకేతిక పరమైన కారణాలతో సేవలు నిలిచిపోవడంతో దాని స్థానంలో ఇన్‌శాట్–3డీఆర్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధం చేశారు. 2000 కిలోలు బరువు కలిగిన ఇన్‌శాట్–3డీ ఉపగ్రహానికి సోలార్ ప్యానెల్స్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో దాని నుంచి సేవలు నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. అందుకే దాని స్థానంలో జీఎస్‌ఎల్‌వీ ఎఫ్05 రాకెట్ ద్వారా ఇన్‌శాట్ –3డీఆర్ పంపేందుకు ఈ ప్రయోగాన్ని చేస్తున్నారు. ఇన్‌శాట్–3డీ స్థానంలో రీప్లేస్ చేస్తున్నారు. కాబట్టి దీనికి ఇన్‌శాట్–3డీఆర్ నామకరణం చేసినట్టుగా కూడా తెలుస్తోంది.