మాట్లాడుతున్న ప్రొఫెసర్ హరగోపాల్
దోమలగూడ: నాణ్యమైన విద్యను అందించాలనే ప్రజల అకాంక్షను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గత విద్యా విధానాన్నే అవలంబిస్తే తెలంగాణ సాధించుకుని ఏం లాభమని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధానకార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ప్రభుత్వ బడుల మూసివేతను వ్యతిరేకిస్తూ, ‘రేషనలైజేషన్‌ను అడ్డుకుందాం.. విశ్వవిద్యాలయాలను కాపాడుకుందాం’ పేరుతో శుక్రవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత విద్యావిధానం కార్పొరేట్, సామ్రాజ్యవాద శక్తులకు ఊడిగం చేసేలా ఉందన్నారు.
తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక టాక్స్ విధించి విద్యాభివృద్ధికి ఖర్చు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జీఎస్‌టీ బిల్లు విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ప్రభుత్వ విద్యా బోధన సరిగా జరగదని కార్పొరేట్, మార్కెట్ శక్తులు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. వీసీలను నియమించకుండా, నిధులు ఇవ్వకుండా యూనివర్సిటీలను ధ్వంసం చేస్తున్నారని, కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలులో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్నారు. రాష్ట్రంలో దాదాపు 12 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు.
ప్రొఫెసర్ కె చక్రధరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు నిధులు లేవంటున్న ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ప్రైవేట్ విద్యా సంస్థలను పోషిస్తుందన్నారు. ప్రభుత్వం ఆర్ధిక లావాదేవీలు జరిగే రంగాలనే ప్రోత్సాహిస్తుందని, విద్యరంగం బలోపేతం పట్ల నిబద్దత లేదని అన్నారు. కేంధ్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం పేరుతో ప్రైవేటీకరణను, విదేశీ సంస్థల పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు హిందూత్వ ఆలోచనలను రుద్దాలని చూస్తుందన్నారు. ప్రభుత్వం పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని, కామన్ స్కూలు విధానాన్ని తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.