
అత్యాశతో హైడ్రామా!
► మంగళగిరిలో ఆలయ భూములు అమ్మకానికి సిద్ధమైన కౌలుదారులు
► విషయం తెలుసుకొని కౌలు వేలం నిర్వహించిన అధికారులు
► అధికారుల ఎదుటే ఆత్మహత్యాయత్నం చేసిన తల్లీకుమారుడు
రాజధాని ప్రభావంతో మంగళగిరి ప్రాంతంలో భూముల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. దేవాదాయ భూములనూ కౌలుదారులు అత్యాశకు పోయి అమ్ముకునేందుకు సిద్ధమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ శాఖ అధికారులు కళ్లు తెరవడంతో అమ్మకం ఆగిపోయింది. భూములకు కౌలు వేలం వేసేందుకు దేవాదాయశాఖాధికారులు సోమవారం సిద్ధమవ్వగా ఇప్పటికే సాగు చేసుకుంటున్న కౌలుదారులు నానా యాగీ చేశారు.
సాక్షి, మంగళగిరి : పాత మంగళగిరిలోని సీతారామాంజనేయ దేవస్థానం భూముల అమ్మకం గుట్టురట్టయింది. కౌలు ముసుగులో కౌలు దారులు రూ.70 కోట్లు విలువ చేసే భూములను విక్రయించేందుకు సిద్ధమయ్యారు. చివరి నిమిషయంలో ఆలయ కార్యనిర్వహణాధికారి తెలుసుకొని ఆ భూములకు కౌలు వేలం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఎలాగైనా వేలం అడ్డుకునేందుకు కౌలుదారులు ఆత్మహత్యాయత్నం హైడ్రామా నడిపారు.
ఆలయానికి 80 ఎకరాల భూములు...
సీతారామాంజనేయ స్వామి ఆలయానికి సుమారు 80 ఎకరాల భూములున్నాయి.డి.నెం 66లో 4.24 ఎకరాలు, డి.నెం 63లో 0.32 సెంట్లు, డినెం 61లో 0.04 సెంట్లు భూములకు పట్టణంలోని కొత్తపేటకు చెందిన నూతలపాటి అప్పారావు కౌలు దారుడుగా ఉన్నారు. 1975 నుంచి కౌలుకి సాగు చేస్తున్నారు.
2003లోనే స్వాహా చేసేందుకు పథకం...
సొంత భూమిలే ని పేద రైతునని (ల్యాండ్ లెస్ పూర్ ) పత్రం పొంది ఆ భూములను స్వాహా చేసేందుకు 2003లోనే పథకం వేసి కౌలుదారుడు కోర్టు ను ఆశ్రయించారు. కానీ న్యాయస్థానంలో వారికి అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు. కౌలుదారు అప్పారావు చనిపోవడంతో ఆయన తనయుడు శివకు ఆ భూములపై కన్నుపడింది. బహిరంగ మార్కెట్‌లో ఎకరం రూ.5 కోట్ల చొప్పున విక్రయానికి పెట్టారు. విషయం బయటకు పొక్కడంతో ఈవో భూములకు సోమవారం కౌలు వేలం నిర్వహణ చేపట్టారు.
విషయం తెలుసుకొని అప్పారావు తనయుడు శివ ఆత్మహత్యాయత్నం పేరుతో దేవుని సాక్షిగా హైడ్రామా నడిపాడు. అప్పారావు తనపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడమే కాక తన తల్లి పై కూడా కిరోసిన్ పోశాడు. సోమవారం జరగాల్సిన వేలం రద్దు కావడంతో మరోసారి వేలం నిర్వహిస్తామని ఈవో జె.నారాయణ తెలిపారు. పోలీసులు తల్లీకుమారుడిని అదుపులోకి తీసుకున్నారు.