హ్యాపీ..హ్యాపీ సండే
హ్యాపీ..హ్యాపీ సండే
Published Sun, Aug 7 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
విజయవాడ సెంట్రల్ :
ఆటపాటలతో కుర్రకారు స్టెప్పులేశారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నా పెద్ద ఒక్కటై కబడ్డీ.. కబడ్డీ.. అంటూ కూతపెట్టారు. రాక్‌బ్యాండ్ డాన్స్, జానపద నృత్యాలతో ఇరగదీశారు. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే బందరు రోడ్డు రెండున్నర గంటల పాటు యువత కేరింతలతో హోరెత్తింది. యూత్ జోష్.. పెద్దల హుషారు కలగలిసిన హ్యాపీ‘సండే’ సందడిగా సాగింది. నగరపాలక సంస్థ, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో వై స్క్రీన్స్ సహకారంతో డీప్ ట్రస్ట్‌లు హ్యాపీ సండే నిర్వహించాయి. బందరురోడ్డులో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వద్దకు ఉదయం ఆరు గంటలలోపే పెద్ద ఎత్తున చిన్నారులు, యువత చేరుకున్నారు. కుటుంబ సమేతంగా హాజరై ఎంజాయ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ సతీమణి ఆండాళ్లు విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడారు. వీరపాడిండియన్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వాలీబాల్ ఆడారు. స్టెప్ బై స్టెప్ డాన్స్ ఇనిస్టిట్యూట్ కళాకారుల డాన్స్, రాక్ బ్యాండ్ డాన్స్, వివిధ జానపద నృత్యాలు అలరించాయి. పిల్లలు, పెద్దలు వాలీబాల్, బ్యాడ్మింటన్, త్రోబాల్, స్కేటింగ్, రన్నింగ్, టెన్నికాయిట్, తొక్కుడు బిళ్ల, ఉప్పులకుప్ప..వయ్యారి భామ ఆటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన అంబారి సత్యనారాయణ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన స్కిప్పింగ్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజయవాడ నగరపాలక సంస్థ పాఠశాలల విద్యార్థులు 2కె రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పలు పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మేయర్ కోనేరు శ్రీధర్, కార్పొరేటర్ నజీర్ హుస్సేన్, కో–ఆప్షన్ సభ్యురాలు చెన్నుపాటి ఉషారాణి, నగరపాలక సంస్థ రీజనల్ ఫైర్ ఆఫీసర్ ఎస్‌వీఎస్ చౌదరి, ఈఈ ధనుంజయ, యూసీడీ పీవో ఎంవీ.సత్యనారాయణ, డీప్ ట్రస్ట్ నిర్వాహకులు జగదీష్, పోలీస్ అధికారులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
Advertisement