హరితహారంలో ముందుండాలి
హరితహారంలో ముందుండాలి
Published Thu, Jul 28 2016 12:28 AM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : రాష్ట్రం భవిష్యత్‌లో కరువుబారిన పడుకుండా ఉండేందుకు ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో జిల్లా నంబర్ వన్‌గా నిలవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. బుధవారం శివునిపల్లి జెడ్పీఎస్‌ఎస్ ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం, స్థానిక ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో రూ. 95 లక్షలతో నిర్మించిన నూతన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఆ తర్వాత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ లక్ష్యంగా కేసీఆర్ పలు పథకాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు. వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే హరితహారంలో నాటిన ప్రతి మొక్కను కాపాడాలన్నారు. జిల్లాలో 4 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 1.70 కోట్ల మెుక్కలు నాటామని చెప్పారు. తండాల్లోని రోడ్ల అభివృద్ధికి రూ. 3.70 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ధర్మసాగర్ రిజర్వాయర్‌ను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ టి.రాజయ్య, అరూరి రమేష్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఐటీడీఏ పీవో అమయ్‌కుమార్, డీటీడబ్ల్యూఓ చందన, ఏటీడబ్ల్యూఓ నిర్మల తదితరులు పాల్గొన్నారు.
Advertisement