జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి | To Effort the district development | Sakshi
Sakshi News home page

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

Published Mon, Aug 15 2016 11:54 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి - Sakshi

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

నల్లగొండ: నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని విద్యుత్‌ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంత్రి నల్లగొండలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించి కలెక్టర్‌ పి.సత్యనారాయణ రెడ్డి, ఎస్పీ ప్రకాశ్‌రెడ్డిలతో కలిసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 26 నెలల పాలనలో జిల్లాలో అన్ని రంగాల్లో అభివృద్ధికి రూ.26 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలోని 4.96 లక్షల మంది రైతులకు రూ.14.65 కోట్ల రుణమాఫీ నిధులు మూడు విడతల్లో మంజురయ్యాయయన్నారు. 2016–17 ఆర్థికసంవత్సరంలో ఖరీఫ్‌ పంట రుణాలు రూ.1600 కోట్లకుగాను ఇప్పటి వరకు రూ. 700 కోట్లను వివిధ బ్యాంకుల ద్వారా 2.25 లక్షల మందికి అందజేసినట్లు మంత్రి తెలిపారు. రైతు బందు పథకం కింద 6 నెలల వరకు వడ్డీ రాయితీపై 294 మంది రైతులకు రూ.3.65 కోట్లు మంజూరు చేశామన్నారు. మిషన్‌ కాకతీయ ఫేజ్‌–1,2లో 2,032 చెరువుల పునరుద్ధణకు రూ.755 కోట్లతో పనులు చేపట్టగా 740 చెరువులు పూర్తయ్యాయన్నారు.  మిషన్‌ భగీరథలో తాగునీటి సరఫరాగాను రూ.3,880 కోట్ల అంచనా వ్యయంతో 2,627 కి.మీ పైపులు కొనుగోలుతో 1364 కి.మీ నిర్మాణం పూర్తి చేసినట్లు మంత్రి చెప్పారు. జిల్లాలో ఫ్లోరోసిస్‌ను నిర్మూలించేందుకు ఉద్దేశించిన డిండి ఎత్తిపోతల పథకం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.6,190 కోట్లతో ఐదు రిజర్వాయర్‌ల నిర్మాణం చేపట్టేందుకు రూ.9,179 ఎకరకాల భూమిని సేకరించి ఇప్పటి వరకు రూ.108 కోట్ల నష్ట పరిహారం చెల్లించినట్లు మంత్రి తెలిపారు. ఏఎమ్మార్పీ, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు కింద 3 లక్షల ఎకరాలకు సాగు నీరు, 516 గ్రామాలకు తాగునీరు అందించేందుకు 30 టీఎంసీల కృష్ణా నది నీటిని వినియోగించుకునేందుకు నిర్ధేశించామన్నారు. శ్రీశైలం నుంచి టన్నెల్‌ ద్వారా గ్రావిటీతో 2.20 లక్షల ఎకరాలకు నీరందించే పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.5,723 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు రూ.4,970 కోట్ల ఖర్చు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.
సంక్షేమ ఫలాలు... రహదారుల అభివృద్ధి
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకంలో భాగంగా 290 కుటుంబాలకు రూ.23.44 కోట్లతో 704 ఎకరాలు పంపిణీ చేసినట్లు మంత్రి చెప్పారు. మరో 667 ఎకరాల భూమి కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉచిత విద్యుత్‌ పథకం ద్వారా 3.52 లక్షల మంది లబ్ధి పొందుతున్నారన్నారు. ఈ ఏడాది కొత్తగా 16 ఎస్సీ గురుకులాలు, మూడు మహిళా డిగ్రీ కాలేజీలు, 5మైనార్టీ గురుకులాలు, ఎస్టీలకు కొత్త గురుకులాలు మంజూరు చేశామన్నారు. పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బీ రహదారుల అభివృద్ధికి రూ.1422 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
ప్రాజెక్టులతో సస్యశ్యామలం
గోదావరిపై నిర్మిస్తున్న మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తయితే ఆలేరు, భువనగిరి, సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. గంధమల్ల, బస్వాపూర్‌ రిజర్వాయర్‌లు అందులో భాగమేనన్నారు. జిల్లాలో విద్యుత్‌ కొరత నివారణకు దామరచర్ల మండలం వీర్లపాలెంలో 6,800 మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంటేషన్, రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి రూ.110 కోట్లు మంజూరై పనులు పురోగతిలో ఉన్నాయాన్నారు. హరితహారంలో భాగంగా జిల్లాలో 4 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 2.05 కోట్ల మొక్కలు నాటడం జరిగిందన్నారు. కృష్ణా పుష్కరాల్లో సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం రూ.599 కోట్లు మంజూరు చేసిందన్నారు.
పథకాల పంపిణీ
మహిళా స్వయం సహాయక సంఘాలకు, ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా దళితులకు, వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా ట్రై సైకిళ్లు, జిల్లా పరిశ్రమల శాఖ, విద్యాశాఖ, సర్వశిక్ష అభియాన్, మైనార్టీ సంక్షేమం, మాడా కార్పొరేషన్ల ద్వారా 2,997 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.10 కోట్ల విలువైన పథకాలను మంత్రి వారికి అందజేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జేసీ సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్‌ నేనావత్‌ బాలూనాయక్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ బొడ్డుపల్లి లక్ష్మీ, డీసీసీబీ చైర్మన్‌ ముత్తవరపు పాండు రంగారావు,  టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌ రెడ్డి, గోలి మ«ధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
సీసీటీవీ పుటేజ్‌ల పరిశీలన
కృష్ణా పుష్కరాల తీరును పరిశీలించేందుకు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కేంద్రీకృత సెంటర్‌ను మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్, ఎస్పీలతో కలిసి సందర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement