మూడేళ్లలో ఆకుపచ్చ నల్లగొండ కావాలి
మూడేళ్లలో ఆకుపచ్చ నల్లగొండ కావాలి
Published Thu, Jul 28 2016 7:47 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
మిర్యాలగూడ
రాబోయే రెండు, మూడేళ్లలో ఆకుపచ్చ నల్లగొండ కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం మిర్యాలగూడలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఎన్‌ఎస్‌పీ క్యాంపులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. భూభాగంలో 33 శాతం అడవులకు గాను తెలంగాణాలో 24 శాతం, నల్లగొండ జిల్లాలో 5 శాతం మాత్రమే ఉన్నాయన్నారు. దాంతో వరుసగా వర్షాలు లేక కరువు ఏర్పడుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకొని మొక్కలు నాటాలని కోరారు. భావితరాలకు మంచి వాతావరణం ఇచ్చే విధంగా కృషి చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలో వచ్చిన రెండేళ్లకే వందేళ్ల అభివృద్ధికి పునాది వేశారని పేర్కొన్నారు. కేసీఆర్ రెండేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి చెప్పాల్సిన అవసరం లేదని, ప్రజల కళ్లకు కనిపిస్తుందన్నారు. మిషన్ భగీరథ పథకం వల్ల ఇంటింటికి ప్రభుత్వ ఖర్చుతో నల్లాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. రాబోయే మూడేళ్లలో పనులు పూర్తవుతాయని తెలిపారు.
ప్రతి మొక్కను సంరక్షించాలి : ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి
హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మిర్యాలగూడలో మినీ రవీంద్రభారతి నిర్మాణానికి కేంద్ర మంత్రిగా జైపాల్‌రెడ్డి ఉన్న సమయలో 60 లక్షల రూపాయలు నిధులు ఇచ్చారని, తాను ఎంపీ నిధుల నుంచి ఒక కోటి రూపాయలు ఇచ్చానని, మరో కోటి రూపాయలు అవసరం ఉందని తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం ప్రారంభమైన ఇండోర్ స్టేడియం కూడా ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభించిందని అన్నారు.
కాంగ్రెస్ నుంచి వచ్చినందుకు ప్రాధాన్యత ఇవ్వాలి
– ఎమ్మెల్యే భాస్కర్‌రావు
కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరినందుకు మాకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు బహిరంగసభ వేదికపై మంత్రి జగదీశ్‌రెడ్డిని కోరారు. మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి చొరవ చూపాలని అన్నారు. కేఎన్‌ఎం డిగ్రీ కళాశాల ప్రభుత్వ పరం గురించి సీఎం కేసీఆర్‌తో మాట్లాడానని, జగదీశ్‌రెడ్డి చొరవ చూపితే ప్రభుత్వపరం అవుతుందని అన్నారు. మిర్యాలగూడలో మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. మినీ రవీంధ్రభారతికి రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. అదే విధంగా మిర్యాలగూడలో బాలికల జూనియర్ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని కోరారు. బహిరంగసభకు మున్సిపల్ చైర్‌పర్సన్ తిరునగరు నాగలక్ష్మి భార్గవ్ అధ్యక్షత వహించగా జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఆర్డీఓ కిషన్‌రావు, మున్సిపల్ కమిషనర్ సత్యబాబు, తహసీల్దార్ మాలి కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్ నియోకవర్గ ఇన్‌చార్జి అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు గాయం ఉపేందర్‌రెడ్డి, ఎంపీపీ జానయ్య, మంగమ్మ, జెడ్పీటీసీలు నాగలక్ష్మి, శంకర్‌నాయక్, పద్మ, వైస్ ఎంపీపీ నూకల సరళ, అన్నభీమోజు నాగార్జునచారి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement