హరితహారాన్ని పకడ్బందీగా నిర్వహించాలి
గ్రామ నోడల్ అధికారులే బాధ్యత తీసుకోవాలి
జెడ్పీ సీఈఓ రమణారెడ్డి
మర్పల్లి: హరితహారంలో భాగంగా గ్రామాల్లో లక్ష్యాన్ని మించి మొక్కలు నాటించే పూర్తి బాధ్యత ఆయా గ్రామాల నోడల్ అధికారుదేనని జెడ్సీ సీఈఓ (ఓఎస్‌డీ) రమణారెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో హరితహారంపై మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏ మండలంలో కురువని విధంగా మర్పల్లి మండలంలో జూలై మొదటివారం నుంచి జూలై 31 వరకు సాధారణ వర్షపాతం కన్నా అధికంగా వర్షాలు కురిసాయన్నారు. దీంతో హరితహారంలో మొక్కలు నాటేందుకు అనువైన కాలమన్నారు. ఇప్పటికే ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేయాల్సి ఉన్నా.. ఎందుకు పూర్తి చేయలేక పోయారని ఆయా గ్రామాల నోడల్ అధికారులపై సీఈఓ రమణారెడ్డి మండిపడ్డారు. నోడల్ అధికారులుగా ఏఏ గ్రామంలో ఎన్ని మొక్కలు నాటారనే వివరాలను గ్రామాల వారీగా అడిగి తెలుసుకున్నారు. వీఆర్‌ఓలు, ఐకేపీ సిబ్బంది నోడల్ అధికారులుగా ఉన్న గ్రామాల్లో లక్ష్యం మేరకు మొక్కలు నాటించకపోవడంతో ఆయా శాఖల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోనున్నామని ఆయన హెచ్చరించాడు.
మండలంలో ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఆయా గ్రామాల్లో లక్షా 89 వేల మొక్కలు వ్యవసాయ పొలాలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలతోపాటు శ్మశానవాటికల్లో మొక్కలు నాటించాలని ప్రణాళికలు రూపొందించారు. ఇంటి ఆవరణల్లో మరో 27 వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు తయారు చేశారు. దీంతో నెలరోజులుగా ఇప్పటివరకు కేవలం లక్షా 82 వేల మొక్కలు మాత్రమే నాటించడంతో మిగతా 27 వేల మొక్కలు ఎందుకు నాటించలేకపోయారని నోడల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు మూడు రోజుల్లో టార్గెట్ పూర్తి చేసి 19 గ్రామ పంచాయతీలకు గాను ప్రతి నోడల్ అధికారి మరో 20 వేల మొక్కలు నాటించేందుకు చర్యలు తీసుకోవాలని రమణారెడ్డి ఆదేశించారు. అనంతరం ఎంపీపీ సుమిత్రమ్మ, వైస్ ఎంపీపీ అంజయ్యగౌడ్ మాట్లాడుతూ గ్రామాల్లో రైతులతో సభలు నిర్వహిస్తే తాము సైతం పాల్గొని రైతులు మొక్కలు నాటుకునేలా తమవంతు సహాయం అందిస్తామన్నారు. సమావేశంలో ఎంపీడీఓ దత్తాత్రేయరాజు, తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, ఈఓపీఆర్‌డీ అశోక్‌కుమార్, మండల విద్యాధికారి విద్యాసాగర్, ఏఓ శ్రీనివాస్, వీఆర్‌ఓలు, పంచాయతీ కార్యదర్శులు ఐకేపీ సీసీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.