తిరుపతిలో భారీ వర్షం
స్తంభించిన జనజీవనం ∙చెట్టు కూలి వ్యక్తి మృతి
పిడుగు పడి దంపతుల మృత్యువాత
తిరుపతి తుడా/తిరుపతి క్రైం/బుచ్చినాయుడుకండ్రిగ: తిరుపతిలో మంగళవారం భారీ వర్షం కురిసింది. చంద్రగిరి, రామచంద్రాపురం, రేణిగుంట, వడమాలపేట, శ్రీకాళహస్తి, బీఎన్ కండ్రిగ, సత్యవేడు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. తిరుపతి డీఆర్ మహల్ సమీపంలో వర్షం కారణంగా భారీ వృక్షం నేలకూలింది. చెట్టు కింద సేదదీరుతున్న 40 నుంచి 43 ఏళ్ల వ్యక్తి మృతిచెందాడు. బీఎన్ కండ్రిగ మండలం కుక్కంబాకం గ్రామంలో పిడుగుపడడంతో రమణయ్య, మునెమ్మ దంపతులు మృతిచెందారు. పలు రహదారుల్లో గాలికి చెట్లు నేలకొరిగాయి. తిరుపతిలో సోమవారం రెండుగంటలు కుండపోత వర్షం పడింది. మంగళవారం మధ్యాహ్నం 2.45 నుంచి 5 గంటల వరకు, రాత్రి 7.15 నుంచి భారీవర్షం కురిసింది. నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపించాయి. పలు వాహనాలు నీట మునిగాయి. గాలి కారణంగా భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
భవనాలపై ఉన్న ప్రచార బోర్డులు కూలిపోయాయి. ఈ కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇళ్లలోకి నీరు చేరడంతో నిత్యావసర వస్తువులు మునిగిపోయాయి. కొర్లగుంట మారుతీనగర్, లక్ష్మీపురం, శివజ్యోతినగర్, మధురానగర్, రైల్వే కాలనీ, ఎస్టీవీకాలని, టీటీడీ సత్రాలు, కల్యాణ మండపాలు, లీలా మహల్ కూడలి, కరకంబాడి రోడ్డు, ఎయిర్ బైపాస్‌రోడ్డులోని పలు కాలనీలు వర్షపునీటిలో మునిగిపోయాయి. ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంలో వర్షపునీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కమిషనర్ హరికిరణ్ అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు.
హార్సిలీహిల్స్‌లో భారీ వర్షం
బి.కొత్తకోట: హార్సిలీహిల్స్‌లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉక్కపోతతో సందర్శకులు ఇబ్బందులు పడుతున్న సమయంలో అకస్మాత్తుగా వర్షం మొదలైంది. పర్యాటకులు వర్షంలో తడుస్తూ సరదాగా గడిపారు. బి.కొత్తకోట, బీరంగి పంచాయతీల్లో భారీవర్షం కురిసింది. వర్షానికి స్థానికులు ఇబ్బందులు పడ్డారు. గుమ్మసముద్రం పంచాయతీ కొండకిందపల్లెలో వర్షం కురిసింది. భారీ వర్షానికి మూడు విద్యుత్ స్తంభాలు పడిపోగా ఒక ట్రాన్స్‌ఫార్మర్ దెబ్బతింది. విద్యుత్ తీగలు తెగి పొలాల్లో పడిపోవడంతో కరెం టుకు అంతరాయం కలిగింది.
చెట్టు కూలి వ్యక్తి మృతి
తిరుపతి నగరంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు గాలివాన బీభత్సం సృష్టించింది. గాలి తీవ్రతకు డీఆర్ మహల్ సమీపంలోని ఒక భారీ వృక్షం కూలింది. ఆ చెట్టు కింద సేదదీరుతున్న 40 నుంచి 43 ఏళ్ల మధ్య వయస్సు గల వ్యక్తి మృతి చెందాడు. రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. వర్షం ఆగగానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని చెట్టును తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు తిరుపతి వాసా ఇతర ప్రాంతానికి చెందిన వాడా అన్నది తెలియాల్సి ఉంది. అతడు వేసుకున్న బట్టలు చూసి యాచకుడని భావిస్తున్నారు. ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు.
పిడుగుపాటుకు భార్యాభర్తల మృతి..
బుచ్చినాయుడుకండ్రిగ మండలం కుక్కంబాకం దళితవాడకు చెందిన కారణి రమణయ్య (40) భార్య మణెమ్మ (35) మంగళవారం పిడుగుపాటుకు గురై మృతి చెందారు. ఇదే గ్రామానికి చెందిన ప్రతాప్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వ్యవసాయ కూలీలైన రమణయ్య, మణెమ్మ ఇదే గ్రామానికి చెందిన ప్రతాప్‌కు చెందిన ఐదు గుంటల పొలాన్ని కౌలుకు తీసుకుని మల్లె తోట సాగు చేస్తున్నారు. మంగళవారం మల్లెపూలు కోయడానికి పొలానికి వెళ్లారు. పూలు కోస్తుండగా అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులు, గాలితో కూడిన భారీ వర్షం వచ్చింది. దీంతో వీరిద్దరూ పొలం గట్టున ఉన్న టేకు చెట్టు కిందకు వెళ్లారు.
పక్క పొలంలో వేరుశనగకు నీరు పెట్టడానికి వచ్చిన ప్రతాప్ కూడా అక్కడికి చేరుకున్నాడు. ఒక్కసారిగా పెద్దశబ్దంతో పిడుగు పడడంతో రమణయ్య, మణెమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. ప్రతాప్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన పక్క పొలాల్లోని రైతులు ప్రతాప్‌ను ఆటోలో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించి, ప్రథమ చికిత్స అనంతరం తిరుపతిలోని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. రమణయ్య, మణెమ్మ మరణంతో వారి కుమార్తె గీత, కుమారుడు భాస్కర్ అనాథలుగా మారారు. చావులోనూ భార్యాభర్తల బంధం వీడపోలేదు. ఘటన స్థలాన్ని తహసీల్దారు జయచంద్ర పరిశీలించారు.