ద్రోణితో కాస్త ఊరట
►అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు
►మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి
►చల్లబడ్డ తిరుపతి, పడమటి మండలాలు
తిరుపతి తుడా: నిన్న మొన్నటి వరకు నిప్పులు చెరిగిన భానుడు సోమవారం కాస్త చల్ల బడ్డాడు. తూర్పు మధ్యప్రదేశ్ సమీపంలో ఏర్పడ్డ అల్పపీడ ద్రోణి కారణంగా జిల్లాలో రెండు రోజులుగా అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకుం టుండడంతో కొంత చల్లగా ఉంటోంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వేళ వరకు వర్షాలు పడుతున్నాయి. ద్రోణి ఉన్నంత వరకు ఈ పరిస్థితి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్యుములో నింబస్ ప్రభావం రోజుకు రెండు మూడు గంటలు మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వడగళ్ల ప్రభావంతో పంట నష్టం ఏర్పడుతోంది. ద్రోణి కర్ణాటక రాష్ట్రం దాటేందుకు మరో మూడు, నాలుగు రోజులు పట్టే అవకాశముందని, అప్పటి వరకు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఎండలు పెరగడానికి కారణం
తూర్పు మధ్యప్రదేశ్ నుంచి వేడి గాలులు రాష్ట్రం వైపు వీస్తున్నాయి. ఈ కారణంగా ఆరు రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చాయి. వాయువ్య గాలుల ప్రభావం జిల్లాపై పడింది. ఈ కారణంగానే జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ప్రస్తుతం ద్రోణి ప్రభావం పడటంతో వేడి తగ్గుముఖం పట్టింది.
చల్లబడ్డ వాతావరణం
ద్రోణి పుణ్యమా అని నాలుగు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. వాయువ్య గాలులపై ద్రోణి ప్రభావంతో 45.5 నుంచి 39.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖ పట్టాయి. మరో నాలుగు రోజుల్లో 1 నుంచి 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది. నాలుగు రోజులుగా అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. తిరుపతితో పాటు పడమటి మండలాల్లోనూ ఉష్ణోగ్రతలు తగ్గి, వాతావరణం చల్లబడుతోంది.