
రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు..
విశాఖపట్నం: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలిక పాటి జల్లులు గాని, మోస్తరు వర్షాలు గాని కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం నివేదికలో తెలిపింది. ఆ తర్వాత వర్షాలు ఊపందుకునే అవకాశం ఉందని పేర్కొంది.
మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి ఈ నెల నాలుగు నుంచి కోస్తాంధ్రలో, ఐదు నుంచి రాయలసీమలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవవచ్చని ఐఎండీ వివరించింది. గడచిన 24 గంటల్లో చీపురుపల్లిలో 5, బాపట్ల, ఇచ్ఛాపురంలలో 4, గరుగుబిల్లి, భీమవరం, పార్వతీపురం, పాలకొండల్లో 3, బలిజపేట, జియ్యమ్మవలస, గిరివిడిల్లో రెండేసి సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది.