నల్లగొండ జిల్లా అతలాకుతలం
నల్లగొండ: జిల్లాలో వరుసగా మూడో రోజు వానలు దంచి కొడుతున్నాయి. అల్పపీడనం బలపడటంతో రుతుపవనాలు స్థిరంగా కొనసాగి జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సగటున 1.8 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదుకాగా.. అత్యధికంగా చౌటుప్పల్‌లో 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
కోదాడ, పోచంపల్లి, మర్రిగూడలో 9సెం.మీ, బీబీ నగర్, నిడమానూరు, పోచంపల్లిలలో 5 సెం.మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. దీంతో జిల్లాలో వాగులు,వంకలు పొంగి పొర్లుతున్నాయి. మూసీ మహోధృతంగా ప్రవహిస్తోంది. బీబీనగర్, వలిగొండ, రామన్నపేట, చిట్యాల, భువనగిరి మండలాల్లో మూసీ అలుగు పోస్తుండటంతో చాలాచోట్ల వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మోత్కూర్ మండలంలో బిక్కేరు వాగు, మిర్యాలగూడ, వేములపల్లి మండలాల్లో పాలేరు వాగు, అనుముల గుర్రంపోడు మండలాల్లో హలియా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కేతెపల్లిలోని మూసి ప్రాజెక్ట్కు గంట గంటకు వరద పెరుగుతండటంతో ప్రాజెక్ట్ అధికారులు 5 గేట్లు తెరచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 644.5 అడుగులకు చేరింది.
13 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తుండగా.. 5 గేట్ల ద్వారా అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. మేళ్ళచెరువులోని పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద నీరు కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో 1,27,300 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి సామర్ద్యం 45 టీఎంసీలు కాగా ప్రస్తుతం 26.5 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రాజెక్ట్ క్రింద ముంపు గ్రామాలైన అడ్లూరు, వెల్లటూర్, నెమిలిపురి, చింత్రియాల గ్రామాల ప్రజల్ని రెండు వారాల క్రితమే అధికారులు పునరావాస ప్రాంతాలకు తరలించారు.
భారీగా కురుస్తున్న వర్షంతో దామరచర్ల మండలం బొత్తల పాలెం వద్ద అద్దంకి -నార్కెట్‌పల్లి రహదారిపై భారీగా వరద ప్రవహిస్తుండటంతో వాహనాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. మిర్యాలగూడలో కుండపోతగా కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రకాష్ నగర్, ముత్తిరెడ్డి కుంట, బంగారుగడ్డ, రైల్వే కాలనీ, హనుమాన్ పేట కాలనీల్లో ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేళ్ళచెరువు మండలం బుగ్గమాధారం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
బీబీనగర్ మండలం పడమటి సోమారం బునాదిగాని కాల్వకు భారీగా వరద నీరు రావడంతో గండి పడింది. దీంతో ఐబీ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే ఐబీ శాఖ అధికారులకు సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. భారీ వర్షాలకు జిల్లాలో 600 చెరువులు పూర్తిగా నిండి అలుగులు పోస్తున్నాయి. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ సమీపంలో రైల్వే ట్రాక్ వర్షపు నీటితో మునిగిపోవడంతో ముందు జాగ్రత్తగా కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌లో అత్యవసరంగా నిలిపివేశారు.