ఎన్నాళ్లకెన్నాళ్లకు..! | hereditary jobs for singareni collieries company family employees | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లకెన్నాళ్లకు..!

Published Sat, Nov 5 2016 2:58 AM | Last Updated on Thu, Aug 9 2018 4:51 PM

ఎన్నాళ్లకెన్నాళ్లకు..! - Sakshi

ఎన్నాళ్లకెన్నాళ్లకు..!

20 ఏళ్ల తర్వాత సింగరేణిలో వారసత్వ కొలువులు
సీఎం ఆదేశాలతో సింగరేణి యాజమాన్యం గ్రీన్‌సిగ్నల్‌
48 నుంచి 59 ఏళ్ల వారు అర్హులని నిర్ణయించిన బోర్డు
18 వేల మంది కార్మికులకు లబ్ధి
చంద్రబాబు హయాంలో నిలిపివేసిన నియామకాలు
పునరుద్ధరణకు కార్మిక సంఘాల సుదీర్ఘ పోరాటం


సాక్షి, హైదరాబాద్‌/కొత్తగూడెం
సింగరేణి కార్మికులకు శుభవార్త. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత సింగరేణి సంస్థ చారిత్రక నిర్ణయం తీసుకుంది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు సింగరేణి బోర్డు అంగీకరించింది. ప్రస్తుతం పనిచేస్తున్న సింగరేణి కార్మికుల్లో గత దసరా నాటికి అంటే 2016 అక్టోబర్‌ 11 నాటికి 48 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు వారసత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. సదరు ఉద్యోగి కొడుకు లేదా అల్లుడు లేదా తమ్ముడు వారసత్వ ఉద్యోగం పొందేందుకు అర్హులని ప్రకటించింది. 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారిని మాత్రమే అర్హులుగా పరిగణిస్తామనే నిబంధన విధించింది. దీంతో సింగరేణివ్యాప్తంగా దాదాపు 18 వేల మంది కార్మికుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని భావిస్తు న్నారు.

శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సింగరేణి బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వారసత్వ ఉద్యోగాలకు బోర్డు అంగీకరించినట్లు సమావేశం అనంతరం సింగరేణి సంస్థ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.శ్రీధర్‌ ప్రకటించారు. ఎంతో కాలంగా ఎదురుచేస్తున్న కార్మికుల కోరిక నెరవేరిందని, ముఖ్యమంత్రి ఆదేశంతో బోర్డు సమావేశంలో చర్చించి ఈ అంశాన్ని ఆమోదించినట్లు వెల్లడించారు. బోర్డు సమావేశంలో మణుగూరు ఒపెన్‌ కాస్ట్‌లో ఓబీ తొలగింపునకు అనుమతి, బుల్‌డోజర్ల కొనుగోలు, హైవాల్‌ మైనింగ్, సత్తుపల్లి వాషరీల ఏర్పాటు తదితర అంశాలను చర్చించారు.

1997లో నిలిపివేసిన చంద్రబాబు సర్కారు
1997 వరకు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగింది. నష్టాలు సంభవిస్తున్నాయనే నెపంతో 1997లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియను నిలిపేశారు. అయితే అధికారికంగా ఉద్యోగాల నిలుపుదల గురించి చంద్రబాబు సర్కారు 2002లో ప్రకటించింది. వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటూ కార్మిక సంఘాలు పలుమార్లు ఆందోళనలు, ఉద్యమాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో సింగరేణి వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పలుమార్లు సింగరేణి సంస్థతో, కార్మిక సంఘాలతో జరిపిన చర్చలు ఎట్టకేలకు ఫలప్రదమయ్యాయి.

అక్టోబర్‌ 6న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు, సింగరేణి ఏరియాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌తో సమావేశమై వారసత్వ ఉద్యోగాలపై విన్నవించగా.. సానుకూలంగా స్పందించారు. అదే రోజు సింగరేణి లాభాల బోనస్‌ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీఎండీ శ్రీధర్‌తో చర్చలు జరిపిన సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. వారసత్వ ఉద్యోగాలకు అవకాశం కల్పించాలని, వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో వారసత్వ ఉద్యోగాల అమలు విధివిధానాలపై సింగరేణి యాజమాన్యం, కార్మిక సంఘాల ప్రతినిధులు, సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు ఉన్నతస్థాయి అధికారులతో రెండు దఫాలుగా చర్చలు జరిపారు. ఎట్టకేలకు సానుకూలమైన నిర్ణయం వెలువడటంతో సింగరేణివ్యాప్తంగా కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.

18 వేల మందికి వరం..
సింగరేణి యాజమాన్యం నిర్ణయం సంస్థలో పనిచేస్తున్న 53 విభాగాల ఉద్యోగులకు, కార్మికులకు వరం కానుంది. దాదాపు 18 వేల మంది కార్మికులు వారసత్వపు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తేల్చింది. సింగరేణిలో ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లు. ఉద్యోగ విరమణకు ఏడాది ముందు వరకు వారసత్వ ఉద్యోగాలు పొందేందుకు కార్మికులను అర్హులుగా ప్రకటించడంతో వారికి కొంత ఊరట లభించినట్లైంది. నిలిపివేత తర్వాత ఉద్యోగ విరమణ చేసిన తమను కూడా వారసత్వ ఉద్యోగాలకు పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగ విరమణ చేసిన కార్మికుల కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సింగరేణికి యువశక్తి: సీఎండీ శ్రీధర్‌
‘ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో ఎంతో మంది కార్మికుల పిల్లలు కొత్తగా ఉద్యోగాలు పొందే అవకాశముంది. సింగరేణిలో యువ ఉద్యోగుల సంఖ్య పెరుగనుంది. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా సింగరేణి చేస్తున్న కృషిలో వీరందరూ భాగస్వాములు కావాలి. కంపెనీని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలి..’ అని సంస్థ సీఎండీ శ్రీధర్‌ పిలుపునిచ్చారు.

కార్మికుల భద్రత మా బాధ్యత: ఎంపీ కవిత
‘కార్మిక కుటుంబాల సంక్షేమాన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఇది. తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి కావటంతో సింగరేణి కార్మికులకు మంచి రోజులొచ్చాయి. బొగ్గు బాయి కార్మికులు తెలంగాణ సైనికులు. వారి ఉద్యోగ భద్రత కూడా మా బాధ్యతగా భావిస్తున్నాం..’ అని కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కవిత వారసత్వ ఉద్యోగాల నిర్ణయంపై స్పందించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement