కృష్ణవంశీ అంటే అభిమానం..
కృష్ణవంశీ అంటే అభిమానం..
Published Fri, Mar 3 2017 10:59 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM
అందుకే హీరోనైనా ‘నక్షత్రం’లో విలన్‌పాత్ర చేస్తున్నా : హీరో తనీష్
అమలాపురం టౌన్ : ‘‘దర్శకుడు కృష్ణవంశీ అంటే నాకు చిన్నతనం నుంచీ అభిమానం. ఆయన తీసిన ఖడ్గం, సింధూరం తదితర సినిమాలు నాపై చాలా ప్రభావం చూపాయి. ఎప్పటికైనా ఆయన దర్శకత్వంలో పనిచేయాలనుకునే అవకాశం కోసం ఎదురు చేస్తున్నా. అందుకే ఆయన కొత్తగా తీస్తున్న నక్షత్రం చిత్రంలో విలన్ ప్రాతను ఏ మాత్రం ఆలోచించకుండా అంగీకరించానని వర్ధమాన సినీహీరో తనీష్ అన్నారు. తాను హీరోనైనా విలన్ పాత్ర పోషించేందుకు ఎంత మాత్రం వెనకడుగు వేయకుండా కృష్ణవంశీ దర్శకత్వంలో నెగిటివ్ షేడ్ పాత్రలో నటిస్తున్నానని చెప్పారు.
ముమ్మిడివరం అనాతవరంలోని ప్రసిద్ధ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న పవర్ 2కే17 ఫెస్ట్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు వచ్చిన హీరో తనీష్ అమలాపురంలోని గ్రాండ్ పార్కులో శుక్రవారం సాయంత్రం విలేకర్లతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. ‘‘దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో పనిచేయటమంటే ఏ నటుడికైనా ఓ గైడ్‌లా ఉంటుంది. నేను బాల నటుడిగా దాదాపు 50 చిత్రాల్లో, హీరోగా 22 చిత్రాల్లో నటించా. 1999లో ప్రేమంటే ఇదేరా చిత్రంలో బాలనటుడిగా నా సినీ ప్రస్థానం మొదలైంది. దేవుళ్లు, మన్మథుడు చిత్రాల్లో బాలనటుడిగా గుర్తింపు పొందా. ప్రస్తుతం దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న నక్షత్రం చిత్రం, దర్శకుడు కార్తికేయ తీస్తున్న రంగు చిత్రంలో నటిస్తున్నా. నక్షత్రం చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
హీరోగా.. ‘‘నచ్చావులే’’
హీరోగా నచ్చావులే చిత్రం గుర్తింపు తెచ్చిపెట్టింది. కోడిపుంజు, రైడ్, మేము వయసుకు వచ్చాం...ఏం పిల్లో...ఏం పిల్లడో చిత్రాలు నన్ను పరిశ్రమలో నిలదొక్కుకునేలా చేశాయి. గతంలో జరిగిన పొరపాట్లు, తప్పులు మళ్లీ దొర్లకుండా చిత్రాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నా. కోనసీమకు రావటం ఇది రెండోసారి. నేనూ గోదావరి జిల్లాల కుర్రాడినే. మా స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు.
Advertisement
Advertisement