చెరువుల్లో మట్టిని ఎలా తరలిస్తారు?
అలా చేస్తే చెరువుల రక్షణ మాటేమిటి?
హైకోర్టు మండిపాటు
సాక్షి, హైదరాబాద్: జగిత్యాల నుంచి నిజామాబాద్‌కు కొత్తగా తలపెట్టిన బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్ నిర్మాణం కోసం సమీపంలో ఉన్న చెరువుల్లోని మట్టిని సదరు కాంట్రాక్టర్ అనుమతి లేకుండా తరలిస్తుండటంపై హైకోర్టు మండిపడింది. ఇలా చేస్తే చెరువుల రక్షణ మాటేమిటని ప్రశ్నించింది. అలా ఎంత మట్టిని కాంట్రాక్టర్ తరలించారో చెప్పాలని రైల్వే అధికారులను ఆదేశించింది. అక్రమ తవ్వకాలు చేపట్టిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
రైల్వేలైన్ నిర్మాణం కోసం సంబంధిత కాంట్రాక్టర్ నిజామాబాద్ జిల్లా మక్ల్కూర్ మండల పరిధిలోని సింగ సముద్రం, లోలం చెరువులో నుంచి మట్టిని తరలిస్తున్నారని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ పి.నరేందర్‌రెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యాజ్యాన్ని పలుమార్లు విచారించిన ధర్మాసనం గతవారం మరోసారి విచారిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అనుమతుల్లేకుండా చెరువుమట్టిని తరలించినందుకు కాంట్రాక్టర్‌పై చర్యలు మొదలు పెట్టామని, రూ.85 లక్షలకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. మట్టి తరలింపుపై ప్రభుత్వ, రైల్వే లెక్కల మధ్య తేడా ఎందుకుందని ధర్మాసనం ప్రశ్నించింది. పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వ, రైల్వేశాఖ న్యాయవాదులను ఆదేశించింది.