ముస్లిం ఇంట ‘మాంగల్యం తంతునానేన..’ | Hinduism to dinner all the way from wedding invitation | Sakshi
Sakshi News home page

ముస్లిం ఇంట ‘మాంగల్యం తంతునానేన..’

Published Sat, Apr 23 2016 2:25 AM | Last Updated on Sun, Sep 3 2017 10:31 PM

ముస్లిం ఇంట ‘మాంగల్యం తంతునానేన..’

ముస్లిం ఇంట ‘మాంగల్యం తంతునానేన..’

శుభలేఖ నుంచి విందు వరకు అన్నీ హైందవం ప్రకారమే

 రంపయర్రంపాలెం (గోకవరం): హిందూ సంప్రదాయాల పట్ల మక్కువ కలిగిన ఓ ముస్లిం  తన కుమార్తె వివాహాన్ని హైందవ సంప్రదాయంలో జరిపించాడు. ఆ ఇంట ‘మాంగల్యం తంతునానేన..’ వేద మంత్రాలు ప్రతిధ్వనించాయి. పెళ్లి కుమారుడి తరపు వారిని, కుటుంబసభ్యులను ఒప్పించి పెళ్లి జరిపించడం విశేషం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం, రంపయర్రంపాలేనికి చెందిన వ్యాపారి, వైఎస్సార్‌సీపీ నేత షేక్ మగ్ధూమ్ (రఫీ)కి చిన్ననాటి నుంచి హిందూ సంప్రదాయాలంటే మిక్కిలి మక్కువ. వేదమంత్రాలపై అపార నమ్మకం. ఈ విశ్వాసమే తన కుమార్తె రేష్మీ, వరుడు అబ్దుల్ రహీమ్‌ల వివాహం హిందూ సంప్రదాయంలో నిర్వహించేలా చేసింది.

ఇందుకు పెళ్లికుమారుడి తరఫు వారిని, బంధువులనూ ఒప్పించాడు. పెళ్లి సందర్భంగా శుక్రవారం ఉదయం రఫీ ఇంట వేద పండితులు ప్రతి మంత్రానికీ అర్థాన్ని వివరిస్తూ వివాహం జరిపించారు. శుభలేఖనూ హిందూ సంప్రదాయూనుసారం ‘జానక్యాః..’ అనే శ్లోకం, హిందూ దేవతామూర్తుల బొమ్మలతో ముద్రించడం, విందును కూడా పూర్తిగా శాకాహారంతో ఏర్పాటు చేయడం విశేషం. పెళ్లి అనంతరం వధూవరుల తలంబ్రాల ముచ్చట బంధుమిత్రులకు కన్నులపండువలా జరిగింది. కాగా తన గ్రామానికి చెందిన పదిమంది హిందూ అవివాహిత యువతులకు రూ. 10 వేల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన బాండ్లను పెళ్లి పందిరిలో రఫీ.. స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందించారు. హిందూ సంప్రదాయం, వేద మంత్రాలపై తనకు చిన్ననాటి నుంచి నమ్మకమని, అందుకే పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం జరిపించానని రఫీ తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement