అనంతగిరిలో అద్దె భవనంలో అంగన్‌వాడీ కేంద్రం
-
మరుగుదొడ్లు, నీటి సదుపాయం కరువు
-
ఇదీ అంగన్‌వాడీ కేంద్రాల పరిస్థితి
-
పట్టించుకోని అధికారులు
ఇల్లంతకుంట: మూడు నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులలో చదువుపై ఆసక్తిని పెంపొందించే ఉద్ధేశంతో పాటు పౌష్టికాహారాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాలు అరకొర వసతుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. మండలంలో 66 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 30 సొంత భవనాలుండగా 36 కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అద్దె భవనంలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహణ అస్తవ్యస్థంగా మారింది. కొన్ని గ్రామాల్లో పురాతన ఇళ్లలో కేంద్రాలు కొనసాగిస్తుండటంతో చిన్నపాటి వర్షం కురిసినా సమస్యలు తలెత్తుతున్నాయి. అనంతగిరి గ్రామంలోని ఓ అంగన్‌వాడీ కేంద్రం పాత ఇంటిలో నిర్వహిస్తున్నారు. భారీ వర్షం కురిస్తే ఇళ్లు కూలడానికి సిద్ధంగా ఉంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు ప్రతి రోజు భోజనంతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. అద్దె భవనాల్లో కేంద్రాలు కొనసాగించడం ఇబ్బందికరంగా మారిందని అంగన్‌వాడీ కార్యకర్తలు అంటున్నారు. అద్దె భవనాల్లో వసతులు సక్రమంగా లేకపోవడంతో పిల్లలను పంపేందుకు వారి తల్లిదండ్రులు భయపడుతున్నారని వారు పేర్కొంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని కోరుతున్నారు.
నీటి సదుపాయం.. మరుగుదొడ్లు కరువు..
మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో నీటి సదుపాయం లేకపోవడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం గర్భిణీలు, బాలింతలకు భోజనం వండి పెట్టాలని చెప్పడంతో ఏడాదిన్నర కాలంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో వంట చేసేందుకు ఆయాలు, కార్యకర్తలు మరో చోటు నుంచి నీళ్లు తీసుకొచ్చి వంట చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అంగన్‌వాడీ కార్యకర్తలు పేర్కొంటున్నారు.