చరిత్రకు సమాధి
పుష్కరాల పేరుతో ప్రభుత్వం చేస్తున్న హడావుడి 150 ఏళ్ల చరిత్ర ఉన్న కృష్ణా డెల్టాలో నీటిపారుదల వ్యవస్థను దెబ్బతీస్తోంది. బ్రిటిష్ హయాంలో ముందుచూపుతో నిర్మించిన సాగునీటి కాలువలను ధ్వంసం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న లాకులను తొలగించి అక్కడ పుష్కర ఘాట్ నిర్మించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సాక్షి, విజయవాడ :
పుష్కరాల పేరుతో ప్రభుత్వం చేస్తున్న హడావుడి 150 ఏళ్ల చరిత్ర ఉన్న కృష్ణా డెల్టాలో నీటిపారుదల వ్యవస్థను దెబ్బతీస్తోంది. బ్రిటిష్ హయాంలో ముందుచూపుతో నిర్మించిన సాగునీటి కాలువలను ధ్వంసం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న లాకులను తొలగించి అక్కడ పుష్కర ఘాట్ నిర్మించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతానికి ఘాట్లు నిర్మించినా పుష్కరాల అనంతరం జలరవాణా కోసం వాటిని తొలగించాల్సిందేనని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు చెబుతున్నారు. కేవలం 12 రోజులు కోసం కోట్ల రూపాయలను వృథా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీఐపీ ఘాట్‌లో మోడల్ గెస్ట్ హౌస్‌కు ఎడమ వైపు, ప్రకాశం బ్యారేజీ సమీపంలో బ్రిటిష్ పాలన కాలంలో నిర్మించిన లాక్‌లు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని జలరవాణాకు ఉపయోగించుకునేవారు. అప్పట్లో చిన్నచిన్న బోట్లు మాత్రమే వెళ్లేవి. అందువల్ల కేవలం ఆరు మీటర్ల మేర లాకులు నిర్మించారు.
దీన్ని 14 మీటర్లకు విస్తరించాలని ఇరిగేషన్ అధికారులు భావిస్తుండగా, ప్రభుత్వం ప్రస్తుతం ఈ లాకులను పూర్తిగా తొలగించి ఇక్కడ ఘాట్ నిర్మాణం చేసింది. నదిలోని లాకుల్ని తొలగించడమే కాకుండా దానిపై కాంక్రీట్‌తో పూడ్చేశారు. లాకులు దాటిన తరువాత బోట్లు కృష్ణాకెనాల్‌లోకి వెళ్లేందుకు నదిలో ఉన్న జలరవాణా మార్గాన్ని పూర్తిగా మూసివేసి కాంక్రీట్ ఫ్లోరింగ్ చేశారు. కృష్ణాకెనాల్‌లో జలరవాణా కోసం నిర్మించిన గోడ ఆధారంగా రోడ్డు నిర్మాణం చేస్తున్నారు.
ఘాట్‌ను 30 మీటర్ల మేర తొలగించాల్సిందే..
ప్రకాశం బ్యారేజీ నుంచి ముక్త్యాల వరకు జలరవాణా చేయాలని భావిస్తున్నారు. దీనికి కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ఆ తరువాత జలరవాణాను కృష్ణాకెనాల్ ద్వారా ఏలూరు కాలువ నుంచి కాకినాడ వరకు విస్తరించనున్నారు. ముక్త్యాల నుంచి వచ్చే పెద్ద పెద్ద బోట్లు కృష్ణాకెనాల్‌లోకి వెళ్లాలంటే ప్రస్తుతం బ్యారేజీ నుంచి దుర్గాఘాట్ వరకు నూతనంగా నిర్మిస్తున్న ఘాట్‌ను తొలగించాల్సిందేనని ఇంజినీర్లు చెబుతున్నారు. బ్యారేజీ నుంచి సుమారు 30 మీటర్లు తొలగిస్తేనే బోట్లు రాకపోకలు సాగిస్తాయని చెబుతున్నారు. జలరవాణా పనులు ప్రారంభించగానే ఇక్కడ నిర్మించిన నూతన ఘాట్ తొలగించే అవకాశం ఉంది. బ్యారేజీ వద్ద నీటి నిల్వను కొలిచేందుకు ఏర్పాటుచేసిన పరికరాలను ఘాట్ల నిర్మాణం కోసం తొలగించారు. ప్రస్తుతం నీటినిల్వలను అంచనాలతో లెక్కిస్తున్నారు తప్ప వాస్తవంగా ఎంత ఉందనేది కొలవలేకపోతున్నారు.
జలభవన్ కూల్చివేత..
సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలోని జలభవన్‌ను ఇటీవల అధికారులు పుష్కరాల సందర్భంగా రోడ్డు విస్తరణ కోసం కూల్చివేశారు. ప్రస్తుతం ఈ కార్యాలయం చిన్న గదిలో మగ్గుతోంది. దీంతో కృష్ణానది వద్ద నీటి నిల్వలను లెక్కించడం కష్టంగా ఉందని కేంద్ర జలవనరుల శాఖ ఇంజినీర్లు చెబుతున్నారు. ఏమైనా పుష్కరాల పేరుతో నది వద్ద చేపట్టిన అభివృద్ధి పనులు నీటిపారుదల వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.