హృదయం లేని వైద్యులు
-
రక్తమోడుతున్నా హెచ్‌ఐవీ బాధితుడికి వైద్యం నిరాకరణ
-
ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు పడిగాపులు
-
గత్యంతరం లేక ఇంటికి తీసుకెళ్లిన రోగి బంధువులు
గుంటూరు మెడికల్: జిల్లాలోని కొల్లిపర ‡మండలం సిరిపురం గ్రామానికి వ్యక్తి కొంతకాలంగా హెచ్‌ఐవీతో బాధపడుతూ తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆగస్టు నుంచి చికిత్స పొందుతున్నాడు. రెండు రోజుల క్రితం శరీరంలో రక్తం తక్కువగా ఉండటంతో రెండు బాటిళ రక్తం ఎక్కించారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదటపడకపోవడంతో తెనాలి ఆసుపత్రి వైద్యులు గుంటూరు జీజీహెచ్‌కు రిఫర్ చేశారు. ఆదివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో కుటుంబ సభ్యులు రోగిని జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. అత్యవసర సేవల విభాగంలో వీల్‌చైర్‌లోనే రాత్రంతా ఉంచారు. కొన్నిరకాల రక్త పరీక్షలు రాసిన వైద్యులు ఆ రిపోర్టులు వచ్చేసరికి తెల్లవారుజామున 6 గంటలు అవడంతో క్యాజువాలిటీలో వైద్యం చేయకుండా ఓపీకి వెళ్లి చూపించుకోవాలని చెప్పారు. దీంతో వీల్‌చైర్‌లోనే కుటుంబ సభ్యులు ఓపీలో తీసుకెళ్లగా జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, చర్మవ్యాధుల వైద్య విభాగాలకు వెళ్లాలని సూచించారు. ఆయా విభాగాలకు వీల్‌చైర్‌లోనే తిప్పారు. అక్కడ వైద్యులు వైద్య చేసేది తాము కాదంటే తాము కాదంటూ వెనక్కి పంపారు. దీంతో రోగి బాగా నీరసంగా తల్లిదండ్రులు ఓపీ విభాగం వద్దే ఉంచారు. అక్కడ పని చేస్తున్న కాంట్రాక్ట్ శానిటేషన్ సిబ్బంది ఓపీ గదికి తాళాలు వేయాలని బయటకు వెళ్లాలని చెప్పడంతో అక్కడ చెత్తను ఎత్తే బండిలోనే రోగిని ఓపీ భవనం బయటకు తీసుకొచ్చి మందుల షాపు వద్ద చెత్తను నిల్వ చేసే డబ్బాల వద్ద నేలపై పండుకోబెట్టారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అక్కడ వేచి ఉన్నప్పటికీ వైద్యులుగానీ, వైద్య అధికారులుగానీ రోగిని పట్టించుకున్న దిక్కు లేదు. ఈలోగా కాలికి తీవ్రంగా గాయమై రక్తం కారుతుండటంతో కన్నతల్లి విజయకుమారి అది చూసి తట్టుకోలేక కాలికి మందు పూసి ఈగలు వాలకుండా ప్లాస్టిక్ సంచులను తలిగించింది. ఈ తంతు కళ్లారా చూస్తున్న పలువురు రోగుల సహాయకులు, అధికారులు, వైద్యుల తీరుపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. సాయంత్రం వరకు వేచి ఉన్నా వైద్యులు ఎవరూ తమ వైపు రాకపోవడం, వైద్యం అందించకపోవడంతో కుటుంబ సభ్యులు రోగిని ఇంటికి తీసుకెళ్లిపోయారు. పెద్ద ఆసుపత్రిలో వైద్యం చేస్తారని తెనాలి వైద్యులు చెబితే ఎంతో ఆశతో వస్తే కనీసం ఒక్కరు కూడా తమ కుమారుడు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీయలేదని కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు.