ప్రధానోపాధ్యాయుల భర్తీకి రంగం సిద్ధం
ప్రధానోపాధ్యాయుల భర్తీకి రంగం సిద్ధం
Published Mon, Aug 1 2016 12:01 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
– జిల్లాలో 100 హెచ్‌ఎం పోస్టుల ఖాళీ
– పదోన్నతుల ద్వారా నియమించేందుకు చర్యలు
– ఇక నుంచి నెలనెలా పదోన్నతులు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు):
జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసేందుకు విద్యాశాఖాధికారులు సన్నద్ధమవుతున్నారు. పది రోజుల్లో పదోన్నతుల ద్వారా నియమించేందుకు విధివిధానాలను రూపొందిస్తున్నారు. రెండేళ్ల నుంచి హెచ్‌ఎం పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోవడంతో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో 100 హెచ్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో ఇన్‌చార్జి హెచ్‌ఎంలు పని చేస్తుండడంతో సహ ఉపాధ్యాయులు వారి మాటను లెక్క చేయడం లేదు. దీంతో బోధనాభ్యాస కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 1791 ప్రాథమిక, 454 ప్రాథమికోన్నత, 376 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రై మరీ విభాగంలో 60, హయ్యర్ విభాగంలో 40 హెచ్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని రెండేళ్ల నుంచి భర్తీ చేయడం లేదు. దీంతో ఆయా పాఠశాలలకు ఇన్‌చార్జ్ హెచ్‌ఎంలు ఉన్నారు.
రెండేళ్ల నుంచి పదోన్నతులకు నో
రెండేళ్ల నుంచి జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులను చేపట్టడం లేదు. గతంలో నెలనెలా పదోన్నతుల ప్రక్రియ ద్వారా ఖాళీ పోస్టులను భర్తీ చేసేవారు. అయితే రెండేళ్ల క్రితం ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సును ప్రభుత్వం అదనంగా రెండేళ్లు పొడిగించింది. దీంతో ఒక్క ప్రధానోపాధ్యాయుడు పదవీ విరమణ చేయలేదు. ఈ నేపథ్యంలో పదోన్నతుల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఈ డాది జూన్ ఒకటో తేదీ నుంచి ఉపాధ్యాయుల పదవీ విరమణలు ప్రారంభం కావడంతో మళ్లీ నెలనెలా పదోన్నతుల ద్వారా ఖాళీగా ఉన్న హెచ్‌ఎం పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పదవీ విరమణ చేసి ఖాళీగా ఉన్న పోస్టుల్లో పదోన్నతుల ద్వారా హెచ్‌ఎంలను నియమిస్తారు. ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎం పోస్టులను ఎస్జీటీ ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలకు స్కూల్ అసిస్టెంటు ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించి భర్తీ చేస్తారు. ఈ మేరకు ఎంఈఓలు, డీవైఈఓలకు ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను ఇవ్వాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితాను డీఈఓ బ్లాగ్‌లో ఉంచి అభ్యంతరాలకు కూడా పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియ మొత్తం దాదాపుగా పది రోజుల్లో పూర్తి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ వెంటనే ఖాళీ హెచ్‌ఎం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు రంగం అంతా సిద్ధమైంది.
ఆర్‌ఎంఎస్‌ఏ పోస్టులను భర్తీ చేయాలి
గతంలో 31 మంది స్కూల్ అసిస్టెంట్లకు ఆర్‌ఎంఎస్‌ఏ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కల్పించారు. దీంతో ఆయా పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. వీటిని కూడా పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.
పది రోజుల్లో హెచ్‌ఎం పోస్టులను భర్తీ చేస్తాం: రవీంద్రనాథ్‌రెడ్డి, డీఈఓ
జిల్లాలో ఖాళీగా ఉన్న హెచ్‌ఎం పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పది రోజుల్లో పదోన్నతుల ద్వారా నియమిస్తాం. ఇప్పటికే ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు కోరాం. ఆ ప్రక్రియ పూర్తవ్వగానే పదోన్నతులు చేపడుతున్నాం. రెండేళ్ల నుంచి పదవీ విరమణలు లేకపోవడంతోనే ఖాళీ హెచ్‌ఎం పోస్టులను భర్తీ చేయలేకపోయాం.
Advertisement
Advertisement