ఆంధ్రా వారు సంక్రాంతికి వెళ్లొచ్చాకే..
గ్రేటర్ ఎన్నికలపై హోంమంత్రి నాయిని
హైదరాబాద్: హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ఆంధ్ర ప్రాంత ప్రజలు సంక్రాంతికి వెళ్లొచ్చిన తర్వాతే గ్రేటర్ ఎన్నికలు నిర్వహిస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. వాళ్లు పండగకు వెళ్లగానే ఎన్నికలు జరుపుతామంటూ కొంత మంది పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కవాడిగూడలో శనివారం నాగర్‌కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య బంధువు నంది మానవ్ నాయిని సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ... ‘హైదరాబాద్‌లోని ఆంధ్రా ప్రాంత ప్రజలపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం వివక్ష చూపుతుందనే తప్పుడు ప్రచారానికి కొన్ని రాజకీయ పార్టీలు పూనుకున్నాయి.
ఇది పూర్తి అవాస్తవం. సీమాంధ్రులు సంక్రాంతికి వెళ్లి వచ్చిన తరువాతనే గ్రేటర్ ఎన్నికలు నిర్వహిస్తాం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్ సీటుతో పాటు వంద డివిజన్లలో గెలుపొందుతాం. రానున్న రోజుల్లో హైదరాబాద్ విశ్వ నగరంగా మారబోతోంది. విదేశీ పెట్టుబడుల రాకతో వేలాది ఉద్యోగాలు వస్తాయి. సింగరేణిలో 50 వేలు, జెన్‌కోలో 40 వేల ఉద్యోగాలు వచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు’ అని అన్నారు.