కేసీఆర్, ఒవైసీలది కపట నాటకం : భట్టి విక్రమార్క
కేసీఆర్, ఓవైసీలది కపట నాటకం..
* టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క
నాంపల్లి/విజయనగర్‌కాలనీ: సీఎం కేసీఆర్, ఎంఐఎం అధ్యక్షులు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలు కపట నాటకం ఆడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. దళితులు, మైనార్టీలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం మైనార్టీలను మోసం చేస్తున్న కేసీఆర్‌కు ఎంఐఎం ఎందుకు మద్దతు తెలుపుతోందని, 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోవడంపై ఎందుకు ఆందోళన చేయడం లేదని ప్రశ్నించారు.
ముస్లింలపై ఎంఐఎంకు చిత్తశుద్ధి లేదన్నారు. అబద్ధపు హామీలతో ఇద్దరూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. నాంపల్లి నియోజకవర్గంలోని మల్లేపల్లి డివిజన్, విజయనగర్ కాలనీ ఆంధ్రాబ్యాంక్ చౌరస్తాలో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభల్లో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాల పేరు మార్చి కేసీఆర్ టీఆర్‌ఎస్ ప్రవేశపెట్టినట్లుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు.
కేసీఆర్ మాయ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. టీడీపీ, బీజేపీ కూటమి, టీఆర్‌ఎస్, ఇతర పార్టీలకు ఓటేస్తే ప్రజలు మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే నగరాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. నాంపల్లి నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సభలో కాంగ్రెస్ నగర అధ్యక్షులు దానం నాగేందర్, ఉపాధ్యక్షులు ముక్రం అలీ సిద్దిఖీ, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, వినోద్ కుమార్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
18 నెలల్లోనే అభివృద్ధి చేసి చూపాం
* డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
ఖైరతాబాద్: 18 నెలల్లోనే నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించామని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. టీఆర్‌ఎస్ పేదల పార్టీ అని పేర్కొన్నారు. ఎంఎస్ మక్తాలో గురువారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ ఖైరతాబాద్ అభ్యర్థి పి.విజయారెడ్డి, సోమాజిగూడ అభ్యర్థి అత్తలూరి విజయలక్ష్మిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల రెగ్యులరైజేషన్, హైటెన్షన్ వైర్ల తొలగింపు తదితర సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా చేయలేని అభివృద్ధిని టీఆర్‌ఎస్ 18 నెలల్లోనే చేసి చూపిందన్నారు. రాత్రికి రాత్రే పార్టీలు మారేందుకు ప్రయత్నించిన వారికి టీఆర్‌ఎస్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.