ఆ తండాలో మగాళ్లంతా రోడ్డుకు బలి
♦ పెద్దకుంట తండా దుస్థితిపై హైకోర్టు విస్మయం
♦ {పస్తుతం గ్రామంలో ఉన్నది ఒక్క మగ వ్యక్తే
♦ తండాలో మహిళలు దోపిడీకి గురవుతున్నారు
♦ వారిని ఆదుకునేలా ఆదేశాలివ్వండి.. హైకోర్టులో పిల్
♦ వివరాలు కోర్టు ముందుంచాలని ఎన్‌హెచ్‌ఏఐకి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధిలోని పెద్దకుంట తండాలోని మగవాళ్లంతా జాతీయ రహదారిని దాటుతూ మృత్యువాత పడటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇది అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఈ తండాలో ప్రస్తుతం ఒక్క మగ వ్యక్తి మాత్రమే ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామ ప్రజలు రోడ్డును దాటేందుకు వీలుగా అండర్ పాస్ లేదా సబ్‌వేను ఎందుకు నిర్మించలేదని భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)ను ప్రశ్నించి న ధర్మాసనం.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించిం ది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పెద్దకుంట తాండలోని మహిళల పరిస్థితి దుర్భరంగా ఉందని, అనేక రకాలుగా వారు దోపిడీకి గురవుతున్నారని, వారికి రక్షణ కల్పించడంతో పాటు ఆర్థిక సాయం అందించి అన్ని విధాలా ఆదుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరు తూ హైదరాబాద్‌కు చెందిన అషీమ్ అవతార్ దాస్, మరో ఇద్దరు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)ను సోమవారం ధర్మాసనం విచారించింది. పిటీషనర్ల తరఫు న్యాయవాది రచనా వడ్డేపల్లి వాదనలు విని పిస్తూ.. 44వ నంబర్ జాతీయ రహదారి ఎదురుగానే తండా ఉంటుందని, అక్కడికి వెళ్లాంటే తప్పనిసరిగా రహదారిని దాటాల్సి ఉంటుం దని, ఇలా రోడ్డు దాటుతూ రెండేళ్ల కాలంలో 80 మంది మగవారు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ప్రస్తుతం ఆ తండాలో ఒక మగ వ్యక్తి మాత్రమే ఉన్నారని తెలిపారు. ఈ తండాకు ‘రహదారి వితంతుల గ్రామం’ అని పేరు వచ్చిందని, వీరి దీన గాథపై బీబీసీ ప్రత్యేక కథనం ప్రసారం చేసిందని వివరించారు.
ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అందేపల్లి సంజీవ్‌కుమార్ స్పందిస్తూ ఆ తండా మహిళల పరిస్థితి నిజంగానే దుర్భరంగా ఉందని, మగవారంతా రోడ్డు దాటుతూ ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇలాంటి చోట్ల జాతీయ రహదారి దాటేందుకు అండర్‌పాస్ లేదా సబ్‌వే ఎందుకు నిర్మించలేదని ఎన్‌హెచ్‌ఏఐ తరఫు న్యాయవాది వర్మను ప్రశ్నించింది. సబ్‌వే ఉందని ఆయన చెప్పడంతో, మరెందుకు దానిని ఉపయోగించడం లేదని రచనను అడిగింది. తాను ఆ తండాను సందర్శించానని, అక్కడ ఎటువంటి సబ్‌వే లేదని ఆమె స్పష్టం చేశారు.
ఆమె చెప్పిన విషయాన్ని విశ్వాసంలోకి తీసుకుంటున్నామని, సబ్‌వే ఉందని మీకు ఎవరు చెప్పారని, ఆ అధికారి పేరు, హోదా చెప్పాలని వర్మను ఆదేశించింది. ఎన్‌హెచ్‌ఏఐ హైదరాబాద్ మేనేజర్(టెక్నికల్) శైలజ ఈ విషయం చెప్పారని వర్మ తెలిపారు. ఆమెను తదుపరి విచారణకు కోర్టు ముందు హాజరు కావాలని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ఉందని చెబుతున్న సబ్‌వేకు, తండాకు మధ్య ఎంత దూరం ఉందని, అందుకు సంబంధించిన ఫొటోలను తమ ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.