
వసతి పాట్లు !
- జేఎన్‌టీయూ విద్యార్థులను పట్టిపీడిస్తున్న హాస్టల్ కొరత
- హాస్టల్‌లో భోజనం చేసి క్యాంపస్ బయట ఉంటున్న విద్యార్థులు
– దారుణంగా తగ్గిన అడ్మిషన్లు
జేఎన్‌టీయూ: అన్ని వసతలు ఉంటాయి.. బాగా చదువుకోవచ్చన్న లక్ష్యంతోనే ప్రతి ఒక్క విద్యార్థీ జేఎన్టీయూ క్యాంపస్‌లో చేరేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో భాగంగానే సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే హాస్టల్ కొరతతో మౌలిక సదుపాయలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంటెక్ కోర్సుల్లో అడ్మిషన్ పొందే విద్యార్థులు సగం మందికి వసతి కొరతగా ఉండటంతో విద్యార్థులకు దిక్కుతోచని స్థితి నెలకొంది. ఉన్న వాటిలో సామర్థ్యానికి మించి విద్యార్థులకు కేటాయించడంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
భోజనం లోపల.. వసతి బయట
జేఎన్‌టీయూ అనంతపురం క్యాంపస్ కళాశాలలో ఆరు బ్రాంచుల్లో నాలుగు సంవత్సరాల విద్యార్థులు కలిపి 1,440 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి హాస్టల్ సదుపాయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ 22 బ్రాంచుల్లో 697 మంది విద్యార్థులు ఎంటెక్ అభ్యసిస్తున్నారు. వీరిలో 400 మంది విద్యార్థులకు హాస్టల్ కొరత ఉంది. హాస్టల్‌లో అడ్మిషన్ పొందిన విద్యార్థికి ప్రభుత్వం నుంచి స్కాలర్‌షిప్ అందిస్తారు. దీంతో ఈ 400 మంది విద్యార్థులకు భోజనం హాస్టల్‌లో అందుబాటులో తెచ్చారు. కానీ వసతి మాత్రం బయట ఉండాల్సిన దుస్థితి దాపురించింది. బయట అద్దె అధికంగా ఉండటంతో ప్రభుత్వం నుంచి అందుతున్న స్కాలర్‌షిప్ ఏ మాత్రం సరిపోవడం లేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.
ఓటీపీఆర్‌ఐలోనూ అంతే...
ఆయిల్ టెక్నాలజీ రీసెర్చ్, ఫార్మసీ ఇనిస్టిట్యూట్ జేఎన్‌టీయూ అనంతపురంలో ఫుడ్ టెక్నాలజీ, ఫార్మసీ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఎంఫార్మసీలో అరకొరగా సీట్లు భర్తీ అవుతున్నాయి. బీ ఫార్మసీలో సీట్లు భర్తీ అవుతున్నా.. వసతి సౌకర్యాలు లేకపోవడంతో రెండో కౌన్సెలింగ్‌లో ఇతర కళాశాలల వైపు వెళ్తున్నారు.
ప్రతిపాదన పంపాము
ఎంటెక్ విద్యార్థులకు హాస్టల్ సంఖ్య పెంచాలన్న ప్రతిపాదనను ఉన్నతాధికారులకు పంపించాం. లేపాక్షి పక్కన మరో నూతన భవనం నిర్మాణం తలపెట్టాలని వర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. హాస్టల్ కొరత తీర్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
–బి.ప్రహ్లాదరావు , ప్రిన్సిపల్, జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల